చెన్నై: ప్రముఖ నటుడు, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈయన ప్రస్తుతం తన సొంత పార్టీ డీఎంకే యూత్ లీడర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. రెండూ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు స్టాలిన్. ఇదిలా ఉంటే 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో డీఎంకే తరుపున 75 రోజుల క్యాంపెయిన్‌ను తిరుకువలైలో నవంబర్ 20న ఆరంభించారు.
అయితే ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్న హీరో, యూత్ లీడర్ ఉదయనిధి స్టాలిన్‌ను తొలి రోజే పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది . మరోవైపు ఈయన్ని అరెస్ట్ చేసారనే విషయం తెలియగానే డిఎంకే అభిమానులు అట్టుకుడిపోయారు. ఈయన అరెస్ట్‌ను ఖండిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి పాలిస్తున్న ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని పీఠం దించడమే లక్ష్యంగా డీఎంకే ఈ క్యాంపెయిన్‌ను చేపట్టింది.
ఈ ర్యాలీని ప్రారంభించే ముందు చెన్నైలోని మెరీనా బీచ్‌లో కరుణానిధి సమాధి దగ్గర ఉదయనిధి స్టాలిన్ నివాళులర్పించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 234 నియోజకవర్గాల్లో 15 వేల కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టాలని నిర్ణయించింది డీఎంకే పార్టీ. ఈ క్రమంలోనే 1500 సభలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. సినిమాలు చేస్తూనే రాజకీయాలకు కూడా సరైన సమయం కేటాయిస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్. మరోవైపు ఈయన అరెస్ట్‌తో తమిళనాట స్టాలిన్ అభిమానులు కూడా ఆందోళన చేపడుతున్నారు.