మన దేశం పేరు ఇకపై ఇండియా కానే కాదు.! ఇక నుంచి భారత్‌గా మన దేశం పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతుంది.! ఇలా ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాదాపు ఇదే మాట చెబుతోంది. ఏ క్షణంలో అయినా, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, దేశం పేరుని మార్చేస్తుందన్నది మీడియాలో వినిపిస్తున్న కథనాల సారాంశం.
అయితే, ప్రస్తుతానికి విత్తనం మాత్రమే నాటారు.! అసలు విషయం, 2024 ఎన్నికల తర్వాత ముందుకు కదులుతుందట. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, భారత్ నినాదంతోనే సత్తా చాటాలనుకుంటోందిట. దానికోసం ఇప్పుడే ఓ లీకు వదిలి, దేశ ప్రజల స్పందనని తెలుసుకునే ప్రయత్నం చేసింది.
కానీ, ఇప్పుడే పేరు మారిపోతున్నట్టుగా హంగామా జరిగింది. ఇదిగో తోక.. అంటే, అదిగో పులి.. అన్నట్టు తయారైంది పరిస్థితి. అసలంటూ పేరు మార్చాల్సి వస్తే, దానికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? రాజ్యాంగం అనుమతిస్తుందా.? ఇలాంటి చాలా వ్యవహారాలున్నాయి.
ఓ వైపు జమిలి హంగామా, ఇంకో వైపు భారత్ అనే పేరు చుట్టూ రాజకీయ హడావిడి.. ఇదంతా, అత్యంత వ్యూహాత్మకంగా మోడీ సర్కారు తెరపైకి తెచ్చింది. ఈ గందరగోళంలోపడి, కొట్టుమిట్టాడుతున్నాయి దేశంలోని ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు.
ఇండియా అన్న పేరు మార్చితే, ఐక్య రాజ్య సమితి దగ్గర్నుంచి, చాలా విషయాల్లో చాలా చాలా మార్పులు చేయాల్సి వస్తుందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దానికి చాలా సమయం పడుతుందట కూడా. కామెడీగా, ఈ వ్యవహారంలోకి పాకిస్తాన్ పేరు వచ్చి చేరింది. మన దేశం పేరుని మార్చేస్తే, ‘ఇండియా’ అన్న పేరుని పాకిస్తాన్, తీసుకోవాలనుకుంటుందట.. అదీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కోసమట.! కామెడీ అయిపోయిందంతా.!
ఇంత గందరగోళానికి తెరలేపిన నరేంద్ర మోడీ అండ్ టీమ్, వచ్చే ఎన్నికల్లో ఏం సాధిస్తుంది.? వేచి చూడాల్సిందే.