నెహ్రూ మీద ఎన్ని హత్యాయత్నాలు జరిగాయో!

కోటు కొక ఎర్ర గులాబి, చుట్టూర పిల్లలు, ముఖం మీద చెరగని చిరునవ్వుతో చాచా  పేరుపడిన నెహ్రూని ప్రేమ మూర్తిగా కాకుండా మరొక రకంగా వూహించడం కష్టం.

అయితే భారత దేశపు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కు శత్రువులుంటారంటే నమ్మలేం. ఆయనకు శత్రువులున్నారు, వాళ్ల వల్ల ఆయనకూ ముప్పు ఉందనే ఆందోళనతో నాటి హోం మంత్రి సర్దార్ పటేల్ ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. ప్రధాని గా ఉన్నపుడు ఆయన మీద హత్యాయత్నాలు జరిగాయని, ఆప్రయత్నాలన్నీ ఆయన్ని కంటికి రెప్పలా చూసుకున్న నాటి హోం మంత్రి సర్దార్ పటేల్ వమ్ము చేశాడని చాలా మందికి తెలియదు.

నెహ్రూ మీద జరిగిన హత్యా యత్నాలు బాపూజీ మీద జరిగిన హత్యాయత్నంతో పోల్చలేం అయితే, ఈ హత్యాయత్నాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయని కాలమిస్టు ఉర్వశి కొఠారి  ది ప్రింట్ పోర్టల్ లో రాశారు.

 తొలి హత్యాయత్నం

నెహ్రూపై తొలిహత్యాయత్రం 1948 జూలై లో జరిగింది. ఈ విషయాన్ని టైమ్సాఫ్ ఇండియా Alleged Plot to Kill Leader: Three Arrested in Bihar అనే శీర్షికతో జూలై 31, 1948న రాసింది. ఈ న్యూస్ రిపోర్టు ప్రకారం నెహ్రూ, సర్దార్ పటేల్ లను హత్య చేసే కుట్రతో ఒక గ్యాంగ్ బీహార్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. వీళ్లని బీహార్, లఖీసరాయ్ వద్ద ఉన్న ధర్మశాల వద్ద అరెస్టు చేశారు. తమ పథకం గురించి గ్యాంగ్ సభ్యుడొకరు బీహార్ ముంగేర్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడికి కూడా వెల్లడించారు. ఈ కుట్ర అమలుచేసేందుకు ముగ్గురు వ్యక్తులు రెండు పిస్టల్స్, రెండు రివాల్వర్లు, రెండు రైఫిళ్లు, కొన్ని నాటు బాంబులతో ఢిల్లీలో ఉన్నారని కూడా అతగాడు నోరు జారాడు.

పటేల్ ఆందోళన

నెహ్రూ భద్రత మీద సర్దార్ పటేల్ యోచిస్తూనే ఉండేవాడు. 1950 ఏప్రిల్ లో ఆయన పాకిస్తాన్ ప్రధాని లియాకత్ అలీని కలుసుకున్నపుడు కూడా పటేల్ నెహ్రూ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ‘ముస్లిం హక్కుల కోసం జవహర్ లాల్ నెహ్రూ రేయింబగలు కష్టపడుతున్నారు. గాంధీకి జరిగినట్టే నెహ్రూకు జరుగుతుందేమోననే బెంగతో నాకు రాత్రుళ్లు నిద్రపట్టడం లేదు.’ అని పటేల్ అన్నట్లు Patel: A Life అనే పుస్తకంలో రాజ్ మోహన్ గాంధీ చెప్పారు (పేజీ 498). సర్దార్ పటేల్ ఆందోళన గురించి ఆయనకు సెక్రెటరీగా పనిచేసిన కూతరు మణిబెన్ తన డైరీలో 1950 ఏప్రిల్ 5 రాసుకున్నారని రాజ్ మోహన్ గాంధీ రాసుకొచ్చారు.

పార్లమెంటులో ప్రకటన

అదే ఏడాది పటేల్ పార్లమెంటులో మాట్లాడుతూ నెహ్రూ మీద జరుగుతున్న హత్యాయత్నం జరిగే ప్రమాదం గురించి ఒక సంచలన ప్రకటన చేశారు. ‘ మహాత్మాగాంధీని హతమార్చిన వాళ్ల తదుపరి టార్గెట్ పండిట్ నెహ్రూ అయ్యాడు,’ అని హోంమంత్రి అన్నారు. ఈ విషయాన్ని 1950, ఆగస్టు 3న టైమ్సాఫ్ ఇండియా Govt. Determined to Meet All Challenges: Sardar Patel’s Statement in Parliament అనే శీర్షిక తో అచ్చేసింది.

నెహ్రూ మీద జరిగిన ఒక కుట్ర గురించి 1950 ఆగస్టు 3న The Washington Post కూడా ఒక వార్త ప్రచురించింది. గత ఏడాది తూర్పు పాకిస్తాన్ కల్లోలం ఎదురైనపుడు ప్రధానిని చంపేందుకు ఒక కుట్ర జరిగిందని ఎల్ పి భోపాత్కర్, ఆఖిల భారత హిందూ మహాసభ మాజీ అధ్యక్షుడు, ఒప్పుకున్నట్లు పటేల్ వెల్లడించారని వాషింగ్టన్ పోస్ట్ రాసింది.

  రైలు పెల్చే కుట్ర 

ప్రధాని నెహ్రూ ప్రయాణిస్తున్న రైలును పేల్చేసేందుకు జరిగిన కుట్రని 1953 మే 4న భగ్నం చేశారు. సకాలంలో రైలు పట్టాలమీద బాంబును కనుగొనడంతో ఈ కుట్ర భగ్నమయింది. ఈ సంఘటన మీద టైమ్సాఫ్ ఇండియా 1953 మే 5 న ఇలా రిపోర్టు చేసింది. ‘ సెంట్రల్ రైల్వేకి చెందిన రైల్వే ట్రాక్ ను కాపలా కాస్తున్న కాన్ స్టేబుల్ కల్యాణ్ సమీపంలోని పొదల్లో అనుమానాస్పదంగా నక్కికూర్చుని ఉన్న ఇద్దరు వ్యక్తుల మీద కాల్పులు జరిపాడు. ఇది జరిగిన పదినిమిషాలకే జవహర్ లాల్ నెహ్రూ ప్రయాణిస్తున్న అమృతసర్ ఎక్స్ ప్రస్ వెళ్లిపోయింది. అయితే, అవి బాంబులు కాదని కేవలం క్రాకర్స్ మాత్రమేనని మరికొన్ని పత్రికలు రాశాయి.

 

 సెక్రెటరీ మతాయ్ కథనం

నెహ్రూ ప్రయివేటు సెక్రెటరీ ఎం వొ మతాయ్ తన బాస్ మీద జరిగిన హత్యాయత్నం గురించి  రాశారు. నాగపూర్ లో ఒక రిక్షా పుల్లర్ నెహ్రూమీద కత్తితో దాడిచేసేందుకు ప్రయత్నించారని ఆయన రాశారు. ఈ దాడి చేయాలనుకునే వ్యక్తి కి ఒక సిద్ధాంతం ఉందని, అతగాడికి కాంగ్రెస్ పాలన అంటే గిట్లదని అందువల్ల కాంగ్రెస్ పాలనకు మూలకారణమయిన నెహ్రూని అంతమొందిచాలని ఈ దాడికి పూనుకున్నాడని మతాయ్ My Days with Nehru (పేజీ 135)లో పేర్కొన్నారు.

ఈ కత్తిదాడి తన మీద జరిగిన హత్యాయత్నమంటే నెహ్రూనమ్మేలేదట. ఎందుకంటే, కత్తి మరీ చిన్నదని ఆయన అన్నాడు. ‘ అది ఎంత చిన్నకత్తిఅంటే దాన్ని నేనే లాక్కుని ఉండేవాన్ని. ఈ రోజు మిలిటరీ సెక్రెటరీ, పోలీసులు

  వచ్చి రిక్షాపుల్లర్ని పట్టుకున్నారు. ఈ సంఘటనలో 35 మంది సాక్షులను విచారించారు. విచారణ కు నియమించిన కమిషన్ నెహ్రూను కూడా విచారించింది. డాక్టర్ అభిప్రాయం కూడాసేకరించారు. ఈ సంఘటనప్పటి పరిస్థితులలో ఈ కత్తే పెద్ద గాయం చేసి ఉండేదని ఢాక్టర్ చెప్పారు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా డిస్ట్రిక్ట్ , సెషన్స్ జడ్జి రిక్షా పుల్లర్ బాబూరావ్  కు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు. (టైమ్సాఫ్ ఇండియా, జూలై 29, 1955 పేజి 7)