మొక్కజొన్న కంకులను ఎలా కాలుస్తారు? ఇదో ప్రశ్నా అనుకుంటున్నారా? కుంపటిలో కాసిన్ని బొగ్గులను పోసి, ఉఫ్పు, ఉఫ్పు మని ఊదుతూనో, అరచెయ్యి నొప్పి పుట్టేంతలా విసనకర్రతో విసురుతూనో నిప్పులను రాజేసి, వాటిపై కంకులను కాలుస్తారు. ఇప్పటిదాకా మనకు తెలిసిన `శాస్త్రీయ` విధానం అదొక్కటే.
రోడ్డు పక్కన తోపుడుబండ్ల మీద కంకులను కాలుస్తూ తిరుగాడే చిరు వ్యాపారులు తమకు తెలిసిన, అనాదిగా వస్తోన్న సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. కష్టపడకుండా నిప్పులను రాజేయడానికి కావాల్సిన సౌకర్యాలూ అందుబాటులోకి వచ్చాయి.
మరి! ఈ ట్రెండ్‌ను అనుసరించేదెవరు? ట‌్రెండ్ సెట్ చేసేదెవరు? బెంగళూరులో ఓ అవ్వ దీనికి భిన్నంగా ఆలోచన చేసింది. కష్ట పడకుండా నిప్పు ఎలా పుట్టించాలో ఆలోచించింది. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కారణం- సౌర విద్యుత్‌తో నిప్పులను రాజేయాలని ఆలోచించడమే! ఆవిడ పేరు సెల్వమ్మ.
నిజమే కదా! సౌర విద్యుత్ ద్వారా ట్రాఫిక్‌లో సిగ్నళ్లు వెలుగుతున్నాయి. సౌర విద్యుత్ ద్వారా ఇంట్లో బల్బులు వెలుగుతున్నాయి. సౌర విద్యుత్ ద్వారా నీళ్లు వేడెక్కుతున్నాయి. చివరాఖరికి- సౌర విద్యుత్ ద్వారా పంటలకు నీళ్లనూ పారిస్తున్నారు. అలాంటిది అదే సౌర విద్యుత్ ద్వారా బొగ్గుల కుంపటిని రాజేయలేమా?
ఆ అవ్వకు ఈ విషయాలన్నీ ఎవరో చెప్పారో గానీ, అప్పటినుంచీ ఆ పెద్దావిడ ఆలోచనలన్నీ దాని చుట్టే సాగాయి. తనకు తెలిసిన, తన వద్దకు కంకులను కొనడానికి వచ్చే వారినీ ఈ `సాంకేతిక` విధానం గురించి అడిగింది. ఆరా తీసింది. అలా, అలా ఈ విషయం బెంగళూరుకే చెందిన సెల్కో ఫౌండేషన్ ప్రతినిధుల చెవిన పడింది.
ఇక వారు ఏ మాత్రం జాప్యం చెయ్యలేదు. బెంగళూరు విధానసౌధ ఎదురుగా 20 ఏళ్లుగా తోపుడుబండిపై కంకులను కాలుస్తున్న సెల్వమ్మను కలిశారు. సౌర విద్యుత్ వినియోగంలో ఆ పెద్దావిడకు ఏ మాత్రం పరిజ్ఞానం ఉందో తెలుసుకోవడానికి ఓ చిన్న పరీక్ష పెట్టారు.
ఎవరు చెప్పారో గానీ.. సౌర విద్యుత్ వాడకంపై తనకు తెలిసిన విషయాలను వారితో పంచుకుందావిడ. ఈ పరీక్ష ఎందుకంటే- పరికరాలను తాము అమర్చిన తరువాత, వాటిని సరిగ్గా వినియోగించుకోకుండా పోతే బాగుండదనే మనం అర్థం చేసుకోవాలి. సరే! ఆవిడకు ఎంతోకొంత పరిజ్ఞానం ఉందనుకున్న సెల్కో ఫౌండేషన్ ప్రతినిధులు సహకరించారు.
తోపుడు బండి మీద ఓ ఫొటో వోల్టాయిక్ ప్లేట్‌ను అమర్చారు. బొగ్గుల కుంపటికి దాన్ని అనుసంధానించారు. ఆ కుంపటి కింద హీటర్లను అమర్చారు. ఆ హీటర్లు సౌర విద్యుత్‌తో వేడెక్కుతాయి. అలా ఎర్రగా తయారైన హీటర్లపై బొగ్గ ముక్కలను పడేస్తే, అవి అంటుకుంటాయి. ఇక్కడిదాకా- ఒకే! మరి ఊదడానికి. దానికి ఓ ఐడియా ఉంది.
సౌర విద్యుత్‌తోనే పనిచేసేలా ఓ చిన్న ఫ్యాన్‌ను అమర్చారు. స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ వేగంగా తిరుగుతుంది. మన ఇంట్లో తిరిగే ఫ్యాన్‌లాగా దాన్ని కంట్రోల్ కూడా చేయవచ్చు. హీటర్లపై పడేసిన బొగ్గు ముక్కలు, నిప్పురవ్వలుగా మారడానికి ఈ ఫ్యాన్ సహకరిస్తుందన్నమాట.
లా తోపుడుబండిపైనే ఓ చిన్న సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్‌నే అమర్చారు సెల్కో ఫౌండేషన్ ప్రతినిధులు. దాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తాము అమర్చిన సౌర విద్యుత్ ప్లాంట్‌పై కాల్చిన కంకులను డబ్బులిచ్చి మరీ కొనుక్కుని బోణీ చేశారు ఆ ప్రతినిధులు.
ఫొటో కర్టెసీ: పుష్కర్ వి. ప్రిన్సిపల్ న్యూస్ ఫొటోగ్రాఫర్, న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్/ట‌్విట్టర్