బెంగళూరులో దారుణం.. రూ. 20 గుట్కా తెమ్మన్నాడని చంపేశాడు..!

ఐటి హబ్ అయిన బెంగళూరు నగరంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. వర్తూర్ ప్రాంతంలో రూ.20 గుట్కా కోసం జరిగిన చిన్న వివాదం.. హత్యకు దారి తీసింది. మృతుడు బబ్లు, నిందితుడు సీతారామ్ ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారు. బెంగళూరులోని రామగొండనహళ్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్‌లో టైల్స్ పనులు చేస్తున్నారు.. అయితే వీరిద్దరి మధ్య జూలై 28 రాత్రి మద్యం తాగి ఉండగా గొడవ మొదలైంది.

పోలీసుల వివరాల ప్రకారం, బబ్లు తనకు గుట్కా తెచ్చివ్వమని రూ.20 ఇచ్చి సీతారామ్‌కి చెప్పాడు. సీతారామ్ మాత్రం బబ్లు తను కన్నా చిన్నవాడైనా తనకు ఆదేశాలు ఇచ్చాడని భావించి అవమానంగా ఫీల్ అయ్యాడు. కోపంతో కట్టుకున్న ఆగ్రహాన్ని ఆ రాత్రే బబ్లుపై పగ తీర్చుకున్నాడు. బబ్లు నిద్రలో ఉన్న సమయంలో అతనిపై సుత్తితో దాడి చేసి హత్య చేశాడు.

జూలై 29 ఉదయం ఇతర కార్మికులు పని స్థలానికి వచ్చి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీతారామ్‌ను అరెస్టు చేశారు. మద్యం, అహంకారం, అసహనం కలగలిసి ఓ ప్రాణం పోయింది. ఇది చిన్న గొడవే అయినా.. అది చెలరేగి ప్రాణాంతకంగా మారడం అందరికీ దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

అయితే ఇది ఇదివరకు జరిగిన మరో హృదయవిదారక సంఘటనను గుర్తుకు తెస్తోంది. మే నెలలో బేంగళూరులోనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంజయ్ తన స్నేహితుడితో కలిసి వెళ్తుండగా, సిగరెట్ తెమ్మని చెప్పి తేనందుకని కోపంగా ఉన్న నిందితుడు వారిని వెంబడించి బైక్‌ను ఢీకొట్టాడు. దాంతో సంజయ్ మరణించగా, అతని ఫ్రెండ్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ రెండు సంఘటనలు ఒకే విధంగా ఉన్నాయి. మద్యం మత్తు, అహంకారం కలిస్తే ఎంత చిన్న వివాదమైనా ప్రాణాల మీదకు వస్తుంది. బెంగళూరులో ఉద్యోగాల కోసం వచ్చిన వారు, భవిష్యత్తు కోసం వలస వచ్చిన వారు ఇలా ఊహించని ఘటనల్లో బలైపోవడం ఆందోళన కలిగిస్తోంది.