సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ కు వచ్చిన స్టార్‌పై చర్యలు తీసుకొని అరెస్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం, అప్పట్లో దేశవ్యాప్తంగా అందరిని ఆలోచింపజేసింది. అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన ఘటన ఓ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద ఏర్పడిన తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, దీనిపై వెంటనే స్పందించి కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయడం ప్రభుత్వ చురుకైన చర్యగా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కానీ ఇప్పుడు అదే తరహాలో బెంగళూరులో జరిగిన మరింత విషాద ఘటనపై ఎవరిని బాధ్యులుగా చూస్తారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
RCB గెలుపుతో జరిగిన సన్మాన వేడుకల్లో తొక్కిసలాట ఏర్పడి 11 మంది కోల్పోయారు. అందులో పది మంది 35 ఏళ్ళ వయసు లోపు వాళ్ళు ఉండగా, 13 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఇది ప్రభుత్వం, క్రికెట్ బోర్డు, స్థానిక క్రికెట్ అసోసియేషన్, పోలీస్ శాఖలు అన్నీ ఒకే వేదికపై ఉన్న సమ్మేళన వేడుక. అయినప్పటికీ, ఈ ఘటనపై ఇప్పటి వరకూ ఒకరి మీద స్పష్టమైన చర్యలు లేదా అరెస్ట్ జరగలేదు.
BCCI మొదటి నుంచీ ఈ ఘటనకు సంబంధం లేదంటూ తప్పించుకుంది. కనీసం బాధిత కుటుంబాలను ఆదుకునే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. KSCA (కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్) ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిన బాధ్యత వహించకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడినట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎవరూ నిర్దిష్టంగా అరెస్ట్ కానందున, బాధ్యత ఎవరిదన్న దానిపై అనేక వాదనలు చెలామణి అవుతున్నాయి.
ఒకవైపు ప్రభుత్వ అనుమతుల పట్ల గందరగోళం, మరోవైపు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం వల్లే ఈ విషాదం చోటుచేసుకున్నట్లు అనేక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. RCB యాజమాన్యం మరియు KSCA ముందస్తుగా అభిమానుల రాకపై సరైన అంచనాలు వేయకపోవడం, గేట్లు మూసి ఉంచడం, పాసులపై స్పష్టత లేకపోవడం మొదలైన అంశాలు తప్పు వైపు వేలుపోస్తున్నాయి.
అప్పట్లో అల్లు అర్జున్‌కు సినిమాపై ప్రేమ చూపిన అభిమానుల తాకిడి కోసం పోలీసులే కేసు పెట్టారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం, క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల ప్రమేయంతో చోటు చేసుకున్న ఈ విషాదానికి ఎవరినైనా బాధ్యులుగా చూడాలంటే సరైన విచారణ, న్యాయ ప్రక్రియ అవసరం. అభిమానుల ప్రాణాలతో చెలగాటం వేసిన వారిపై చర్యలు తీసుకుంటేనే నిజమైన న్యాయం జరగుతుంది. ఇప్పుడు దేశం చూస్తున్నది అదే.. బన్నీ అరెస్ట్ అయిన తరహాలో ఇక్కడ కూడా ఎవరు జవాబుదారీగా నిలబడతారో.