72 ఏళ్ల ప్రేమ… వారిని ఉద్యమం విడదీసింది, జ్ఞాపకం కలిపింది

ప్రేమించుకొని పెళ్లి అయ్యేంత వరకు కూడా నమ్మకం లేని రోజులివి. పెళ్లి అయినా జీవితాంతం కలిసుంటారనే గ్యారంటి లేదు. భార్యభర్తల మధ్య విబేధాలు వచ్చి విడిపోతున్న జంటలెన్నో. వారు పెళ్లి చేసుకొని పది నెలలు కూడా కలిసి ఉండలేదు.  ఓ ఉద్యమం వారిని దూరం చేసింది. 72 సంవత్సరాల తర్వాత వారు కలుసుకొని జ్ఞాపకంగా మిగిలారు. అవును మీరు చదివింది నిజమే. 72 సంవత్సరాల క్రితం దూరమైన జంట ఇప్పుడు కలుసుకుంది. కాలం వారి ప్రేమ శాశ్వతం అని నిరూపించింది. ఇంతకీ ఎవరా జంట… ఏంటా కథ తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…

అది కేరళలోని కవుంబాయి గ్రామం. అది 1946 వ సంవత్సరం. స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయం. కవుంబాయి గ్రామంలోని ఏక్ నారాయణ్ నంబియార్ కు శారద అనే అమ్మాయితో వివాహం జరిగింది. అప్పుడు ఏక్ నారాయణ్ వయసు 17 సంవత్సరాలు కాగా శారద వయసు 13 సంవత్సరాలు. కొత్తగా పెళ్లైన జంట అన్యోన్యంగా బతుకుతున్నారు. చూస్తుండగానే ఆనందంతో పది నెలలు గడిచి పోయాయి.

కేరళలో కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉంది. అప్పుడే రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. భూస్వాములకు వ్యతిరేకంగా రైతన్నలు పోరాడుతున్నారు. ఆ ఉద్యమంలో నారాయణన్ నంబియార్ తన తండ్రి రామన్ నంబియార్ తో కలిసి పాల్గొన్నారు. యువకుడైన నారాయణన్ కీలక పాత్ర పోషించాడు. శాంతి యుతంగా సాగుతున్న ఉద్యమం హింసాత్మకంగా మారింది. చాలా మంది రైతులు బ్రిటిష్ జవాన్ల కాల్పుల్లో మరణించారు. చాకచాక్యంగా కాల్పుల నుంచి నారాయణన్, ఆయన తండ్రి తప్పించుకున్నారు.  తండ్రి కొడుకులిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లారు.  

వాళ్లిద్దరి ఆచూకీ కోసం బ్రిటిషు పాలకులు వెతికారు. కానీ వారికి ఆచూకీ లభించలేదు. దీంతో వారు ఇంట్లోనే ఉంటారని భావించి బ్రిటిషు జవాన్లు, ఉన్నతాధికారులు ఇంటి పై దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో శారద, ఆమె అత్త మాత్రమే ఉన్నారు. బ్రిటిషు సైనికుల దాడితో శారద భయపడింది. వారి ఆచూకీ చెప్పకపోతే చంపేస్తామని వారు బెదిరించారు. వారి నుంచి ఎలాగో అలా వారు బయటపడ్డారు. అయినా కూడా నిత్యం వారి ఆచూకీ చెప్పమని వారికి బ్రిటిషు సైనికుల నుంచి టార్చర్ ఉండేది.

ఇలా రెండేళ్లు గడిచినా నంబియార్ ఆచూకీ శారదకు లభించలేదు. దీంతో శారద అత్త తన భర్త, కొడుకు చనిపోయాడని అనుకొని శారదను మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరింది. కానీ శారద ఒప్పుకోలేదు. దీంతో పుట్టింటి వారికి చెప్పగా వారు వచ్చి బలవంతంగా శారదను తీసుకెళ్లారు. అయినా శారద తన భర్త కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసింది. కానీ భర్త జాడ దొరకలేదు. ఇంతలోనే బ్రిటిషు సైన్యం నంబీయార్ ను , అతడి తండ్రి ఆచూకీ కనుక్కొని జైల్లో పెట్టారు. తరచు జైల్లు మార్చారు. దీంతో శారదకు వారి అడ్రస్ తెలియలేదు. ఇంతలోనే శారదకు ఆమె పుట్టింటి వారు వేరే సంబంధం చూసి పెళ్లి చేశారు.

మరో వైపు జైల్లో బ్రిటీషు సైన్యం మూర్ఖంగా వ్యవహరించి జైల్లో ఉన్న వారి పై కాల్పులు జరిపింది.  ఈ కాల్పుల్లో నారాయణన్ తండ్రి నంబీయార్ చనిపోయాడు. నారాయణన్ గాయాలతో బయటపడ్డాడు. పది సంవత్సరాల తర్వాత ఏక్ నారాయణన్ నంబీయార్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇంటికి వచ్చే సరికి నారాయణన్ భార్య శారద కనిపించలేదు. ఆ తర్వాత ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించినా ఆమె అడ్రస్ దొరకలేదు. సంవత్సరం పాటు ఎదురు చూసినా ఏక్ నారాయణన్ కు శారద అడ్రస్ దొరకలేదు.దీంతో ఏక్ నారాయణన్ కూడా మరొకరిని వివాహం  చేసుకున్నాడు.

ఒకరి కోసం మరోకరు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా వారి ప్రేమకు ఫలితం దక్కలేదు. విధి వారి ప్రేమను ఎక్కిరించి దూరం చేసింది. ఇంతలో ఎవరి జీవితాన్ని వారు గడుపుతున్నారు. శారద కుమారుడు భార్గవన్ పెరిగి పెద్దవాడు అయ్యి వ్యవసాయం చేస్తున్నాడు.

భార్గవన్ ఓ సారి కన్నూర్ కి వచ్చి అనుకోకుండా ఏక్ నారాయణన్ మేనల్లుడు మధుకుమార్ ను కలుసుకున్నాడు. వారి మాట మధ్యల కుటుంబ వివరాలు చర్చించుకున్నారు. అప్పుడే భార్గవన్ కు తెలిసింది. మధుకుమార్ మేనమామే తన తల్లి శారద మొదటి భర్త అని. 30 సంవత్సరాల క్రితమే శారద రెండో భర్త చనిపోయాడు. నారాయణన్ భార్య కూడా చాలా ఏళ్ల క్రితమే మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. వారిద్దరిని కలపాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని నంబియార్ కు, శారదకు చెప్పారు. దీంతో వారిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నంబియార్ ఆలస్యం చేయకుండా రెక్కల గుర్రంలాగా భార్గవన్ ఇంటికి వచ్చాడు. శారదను చూసి ఉద్వేగానికి లోనయ్యాడు. 

దాదాపు 72 సంవత్సరాల తర్వాత 90 ఏళ్ల వయసులో వారు కలుసుకోవడంతో వారి  ప్రేమ వారి కండ్లలో కన్నీరైంది. వారి నోటి వెంట మాట రాక నిశ్శబ్దంగా ఉన్నారు. ఉబికి వస్తున్న  కన్నీరును అదిమి పెట్టుకుని నంబియార్ శారద తల పై చేయి వేసి నిమిరాడు. దీంతో శారద ఆయన ఒడిలో వాలినట్టుగా తల వంచి కన్నీరు పెట్టుకుంది. ఈ సీన్ ఒక్కటి చాలు వారి మధ్య ఏళ్లు గడిచినా ప్రేమ ఎలా ఉందో చెప్పడానికి . ఇరు కుటుంబాల బంధువులు కూడా వారి ప్రేమకు జై అన్నారు. 

శారద తల పై చేయి వేసి ప్రేమగా మాట్లాడుతున్న ఏక్ నారాయణన్

ఇక నుంచి ఇరు కుటుంబాలు కలుసుకోవాలని నిర్ణయించారు. వారిద్దరిని కూడా కలపాలని నిర్ణయం తీసుకున్నారు. నారాయణన్ మనవరాలు శాంత రచయిత్రి . సినిమాల ఉన్న రియల్ లైఫ్ స్టోరీని శాంత డిసెంబర్ 30 అన్న పేరుతో ఒక నవలగా తీసుకువస్తుంది. వీరి జీవితంతో పాటు రైతు పోరాటాన్ని కూడా ఆమె నవలగా తెస్తున్నారు. కేరళలో జరిగిన ఈ సంఘటన పై ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది స్పందించారు. వారి ప్రేమకు జేజేలు పలికారు. వారు కలిసుండాలని కోరుకున్నారు.