మరో రాంగ్ సెలెక్షన్ – ‘గుణ 369’ రివ్యూ!
‘ఆరెక్స్ 100’, ‘హిప్పీ’ ల కొత్త హీరో మూడో ప్రయత్నంగా ‘గుణ 369’ అంటూ వచ్చాడు. యూత్ లో తనకున్న క్రేజ్, టైటిల్ లో కన్పిస్తున్న యాక్షన్, ఓపెనింగ్స్ కి వర్కౌట్ అయ్యాయి. ట్రైలర్ లో ఎంత పాత విషయం కన్పిస్తున్నా, కొత్త దర్శకుడు బోయపాటి శిష్యుడు కదాని మాస్ ఎగబడ్డారు. ఇప్పుడు ఎంతవరకు తను మాస్ ని సంతృప్తి పర్చగల్గాడు? మాస్ కి – లేదా యూత్ కి నచ్చే పాత్ర, నటన, విషయం, కమర్షియల్ ఎలిమెంట్స్ వగైరా కొత్త దర్శకుడు తనకి ఇవ్వగలిగాడా? కొత్త దర్శకుడి సామర్ధ్యమెంత, అది కార్తికేయకి లాభించిందెంత ఒకసారి పరిశీలిద్దాం…
కథ :
గుణ (కార్తికేయ) ఒంగోల్లో ఓ గ్రానైట్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. తల్లిదండ్రులు (హేమ, నరేష్), ఓ చెల్లెలు వుంటారు. ఓ మిత్రుడు భట్టు (మహేష్) వుంటాడు. సమస్యలు వస్తే హింసకి పూనుకోకూడదనీ, రాజీతో పరిష్కరించుకోవాలనీ గుణ చెప్తూంటాడు. వూళ్ళో రాధా (ఆదిత్యా మీనన్) అనే సెటిల్మెంట్లు చేసే గూండా వుంటాడు. అమ్మాయిల్నిమాన
భంగం చేసి వీడియోలు తీసి బెదిరించే ముఠా ఒకటి వుంటుంది. గీత (అనఘ) మొబైల్ షాపులో పని చేసే అమ్మాయి. గుణ ఈమెతో ప్రేమలో పడతాడు. ఒక ధాబాలో కొందరు రాధని తోసేస్తే కింద పడతారు. రాధా పగబడతాడు. వాళ్ళు గుణని ఆశ్రయించి, రాధాతో రాజీ చేయించమంటారు. గుణ రాధా దగ్గరికి తీసుకు పోతాడు. వాళ్ళు రాధ మీద దాడి చేసి చంపేసి పారిపోతారు. గుణ పోలీసులకి దొరికి పోయి జైలుకి పోతాడు. చెయ్యని నేరానికి ఇరుక్కున్న గుణ ఇప్పుడేం చేశాడన్నది మిగతా కథ.
ఎలావుంది కథ :
‘మన వల్ల పక్కవాడి జీవితానికి ఏ హానీ జరగకూడదు. ఒకవేళ జరిగిందంటే అది పొరపాటు కాదు నేరం. పొరపాటుని క్షమించొచ్చు కానీ నేరాన్ని శిక్షించాల్సిందే’ అనే హీరో డైలాగుతో విలన్ పరంగా సాగుతున్నకథ, ఆడవాళ్ళ మీద జరుగుతున్న అఘాయిత్యాలకి సమాధానం చెప్పిన హీరోగా చానెల్స్ చేసే హడావిడితో ఇంకో కథగా ముగుస్తుంది. ఒక కథ మొదలు పెట్టి ఇంకో కథ. ఫస్టాఫ్ లో విలన్ కథ, సెకండాఫ్ లో హీరోయిన్ కథ. రాజశేఖర్ నటించిన “రౌడీయిజం నశించాలి’ (మోహన్ లాల్ నటించిన “కిరీడం’ రీమేక్) లో హీరో తను కోరుకోకుండా రౌడీయిజంలో ఇరుక్కుని, ఎందుకు రౌడీయిజం నశించాలని అంటాడో అర్ధవంతంగా, బలంగా వుంటుంది. చెయ్యని హత్యలో ఇరుక్కున్న గుణకి ఏం చేయాలో తెలీనట్టు, హీరోయిన్ మరణ కథ మీదికి పోతాడు. ఒక సినిమాలో రెండు కథలు. చివరికి తికమక పెట్టే మేసేజిలు.
ఎవరెలా చేశారు :
చివరి ఇరవై నిమిషాల దాకా కార్తికేయ పూర్తిగా బలహీన పాసివ్ పాత్ర పోషించాడు. పాత్రలో పస లేక నటన నస. సమస్యలు వస్తే హింసకి పూనుకోకూడదనీ, రాజీతో పరిష్కరించుకోవాలనీ చెప్తూంటాడు. ఏ అనుభవంలోంచి ఈ మాటలు అంటున్నాడో పాత్ర చిత్రణ లేదు. ‘శివ’లో నాగార్జున కథానుగుణంగా మనకి కన్పించే అనుభవాల్లోంచి ఐడియాలజీని రూపొందించుకుంటాడు. మాఫియా భవానీని చంపడం పరిష్కారం కాదనీ, భవానీ లాంటి వాళ్ళని తయారు చేస్తున్న వ్యవస్థని అంతమొందించాలనీ ప్రాక్టికల్ గా నిర్ణయానికి వచ్చి, ఆ మేరకు యాక్టివ్ చర్యలు తీసుకుంటాడు. వ్యవస్థని అంతమొందించాకే భవానీని నిర్మూలిస్తాడు.
కార్తికేయ పాత్రది ప్రాక్టికల్ గా వర్కౌట్ కాని పాసివ్ ఐడియాలజీ. దీంతో తనే దగాపడ్డాడు. హింసకే పాల్పడ్డాడు. హీరోయిన్ మానభంగానికి గురై ఆత్మ హత్య చేసుకుంటుంది. ఒకవేళ ఆ సమయంలో తాను అక్కడుంటే హీరోయినుకీ, రేపిస్టులకీ రాజీ కుదిర్చి మానభంగాన్ని ఆపేవాడా? అదేనా చేసేపని?
పాత్ర పాత సినిమా చూస్తున్నట్టు వుంటుంది. పేరెంట్స్ సెంటిమెంటు, సిస్టర్ సెంటిమెంటు, ఫ్రెండ్షిప్ సెంటి మెంటు, తను ఎగ్జాం రాయడానికి వెళ్ళాలంటే ఎవరైనా ఎదురు రావాలనే చాదస్తం, హీరోయిన్ తో చిన్నపిల్లల్లాగా ప్రేమ సన్నివేశాలు …ఇలా అన్ని కోణాల్లో నటించి మెప్పించాలనుకున్నాడు. ఆరెక్స్ -100 తో యూత్ లో క్రేజ్ సృష్టించుకున్న తను, ఈ పాత కాలపు మూస పాత్రలో యూత్ అప్పీల్ కి దూరంగా వుండి పోయాడు.
హీరోయిన్ అనఘ పాత్ర ఇల్లు చూస్తే బ్రహ్మాండం, ఉద్యోగం చూస్తే చిన్న మొబైల్ షాపులో సేల్స్ గర్ల్. రోమాన్స్, యూత్ అప్పీల్ కూడా కుదరలేదు. హీరో ఫ్రెండ్ గా నటించిన కమెడియన్ మహేష్ సస్పెన్స్ తో కూడిన పాత్ర – కామెడీ పెద్దగా లేదు. అయితే ఫస్టాఫ్ కథ వెనుక తనే, సెకండాఫ్ కథ వెనుక తనే వుండే పాత్రచిత్రణ అసహజంగా వుంది.
సెటిల్మెంట్ గూండాగా నటించిన ఆదిత్యా మీనన్ షరా మామూలు అరుపులే. ఇతను కార్తికేయ పాత్రకి విలన్ కాదు. ఇంటర్వెల్లో చనిపోతాడు. కార్తికేయ పాత్రకి ఒక విలన్ అంటూ లేదు. ఉన్న రెండూ బచ్చా గ్యాంగులే కావడం చాలా మైనస్.
టెక్నికల్ గా అంతంత మాత్రంగా వుంది. పాటల గురించి, ఛాయాగ్రహణం గురించి చెప్పుకోవడానికి లేదు.
చివరికేమిటి:
టాప్ డైరెక్టర్ బోయపాటి శ్రీను శిష్యుడు జంధ్యాల అర్జున్ తొలి ప్రయత్నం ట్రెండ్ లో లేదు. పైగా అర్ధంపర్ధం లేని కథతో విసుగు పుట్టించాడు. లాజిక్ అనేది ఎక్కడా లేదు. పైగా చాలా సీన్లు చూసి చూసి వున్నటెంప్లెట్ సీన్లే. హీరోహీరోయిన్లు పరస్పరం బైకుల మీద డాష్ ఇచ్చుకుని పరిచయం కావడం, హీరోయిన్ కి ఉంగరం కొనిపెట్టడం, బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడం, హీరోని తెల్లారి పేరెంట్స్ లేపే హీరో తొలి సీను…ఇలా ఎన్నో టెంప్లెట్ సీన్లే తప్ప, వీటిలోంచి బయటికి వచ్చి కొత్తగా యూత్ ఫుల్ గా సృష్టించింది ఏమీ లేదు.
ఫస్టాఫ్ టెంప్లెట్ లోనే లవ్ ట్రాక్ నడిపి, ఇంటర్వెల్లో విలన్ చనిపోయే యాక్షన్లోకి రావడం, సెకండాఫ్ లో ఆ హత్యానేరం హీరోమీద పడి రిమాండ్ ఖైదీగా జైలు కెళ్ళడం. లాజిక్ లేకుండా రిమాండ్ ఖైదీ జైల్లో రాళ్ళు కొట్టడం! సడెన్ గా విడుదలై పోవడం. చంపినవాళ్లు ఇంకా పరారీలో వుండగానే ఇతన్ని వదిలెయ్యడం.
ఇప్పుడు చూస్తే హీరోయిన్ మరణ వార్త. అది ప్రేమలో విఫలమై చేసుకున్న ఆత్మహత్యగా హీరో నమ్మడం. ఈమె చావుకి చనిపోయిన విలన్ పగబట్టిన అనుచరులు కారకులా అంటే కాదు. ఇది వేరే కథ, దీని బచ్చా గ్యాంగ్ వేరే. మెసేజి వేరే.
కథలో విషయం లేదు, పాత్రల్లో పసలేదు. చివరికి విలన్ తల్లి పాత్రలో మంజు భార్గవి రెండు సీన్లలో ఎంతో బిల్డప్ ఇచ్చి కట్ అయిపోతుంది. ఇలా ఈ కార్తికేయ మూడో మూవీ ఎంటర్ టైనర్ కాదు, రోమాన్స్ కాదు, యాక్షన్ కాదు, బలహీన పాత్రతో శాడ్ మూవీగా కన్పిస్తుంది. కార్తికేయ ఇక ఇలాటి రాంగ్ సెలెక్షన్ – బి గ్రేడ్ మూవీస్ కి దూరంగా వుండక పోతే ఇంతే సంగతులు.
రచన – దర్శకత్వం : జంధ్యాల అర్జున్
తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్, ఆదిత్యామీనన్, నరేష్, హేమ, శివాజీ తదితరులు
సంగీతం: చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : రామ్‌రెడ్డి
బ్యానర్స్ : జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్.జి.మూవీ మేకర్స్‌నిర్మాతలు: అనీల్ కడియాల, తిరుమల్‌రెడ్డి
విడుదల : ఆగస్టు 2, 2019
2 / 5
―సికిందర్