Hair Growth Treatment: జుట్టు కోల్పోవడం చాలా మంది పురుషులకు ఒక పెద్ద సమస్యగా మారింది. బట్టతలపై మళ్లీ జుట్టు పెరిగితే ఎంత బాగుంటుందో అని అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. ఈ భావనను ఉపయోగించుకుంటూ కొంతమంది డబ్బు కోసమే కాక, జనాల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టేస్తున్నారు. ఢిల్లీలో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో జుట్టు పెరిగే ట్రీట్‌మెంట్ అంటూ యాడ్స్ వేసిన ఓ వ్యక్తి చేతిలో వందలమంది బలయ్యారు.
ఢిల్లీకి చెందిన షకీల్ భాయ్ అనే వ్యక్తి తనకు ప్రత్యేకమైన హెయిర్ ట్రీట్‌మెంట్ ఉన్నట్టు ప్రచారం ప్రారంభించాడు. ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు కూడా జుట్టు పెంచానంటూ వీడియోలు, ఫొటోస్ షేర్ చేస్తూ ప్రచార బలాన్ని పెంచుకున్నాడు. ఫలితంగా ప్రజలు పెద్ద ఎత్తున ఢిల్లీ ఓల్డ్ సిటీ ఫతే దర్వాజా ప్రాంతంలో ఉన్న బిగ్ బాస్ సెలూన్ వద్దకు తరలివచ్చారు. జుట్టు పెరుగుతుందన్న నమ్మకంతో అక్కడికి వెళ్లిన వారు, షకీల్ ట్రీట్‌మెంట్‌కు సిద్ధమయ్యారు.
వారు వచ్చిన వెంటనే గుండు గీసి, కెమికల్స్‌తో ట్రీట్‌మెంట్ ఇచ్చిన షకీల్, కొద్ది రోజుల లోపే సమస్యలు తలెత్తడంతో చికిత్స పొందే పరిస్థితి తెచ్చాడు. చాలా మంది బాధితులకు తల మీద దద్దుర్లు, అలర్జీ, గాట్లు, వాపులు మొదలయ్యాయి. కొంత మందికి స్కిన్ ఇన్ఫెక్షన్లు పెరిగి ఆసుపత్రి పాలయ్యారు. జుట్టు పెరిగే ట్రీట్‌మెంట్‌కి వెళ్లి, తలపై మళ్లీ మందులు వాడే స్థితికి చేరారు. బాధితులంతా ఇదంతా షకీల్ అబద్ధ ప్రచారమేనని మండిపడుతున్నారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నిజం కాదని, వాటిని జాగ్రత్తగా పరిశీలించకుండా నమ్మడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఔత్సాహికుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా ఇలాంటి ట్రీట్‌మెంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.