Coolie: తెలుగులో ‘కూలీ’ బిజినెస్.. ఏ రేంజ్ లో ఉందంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’పై అన్ని భాషల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ డ్రామా ఇప్పటికే షూటింగ్ ముగించుకుని ఫుల్ స్పీడ్‌తో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో కథ నడవనుండటంతో, రజినీ అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. విడుదల తేదీగా ఆగస్టు 14ను అనౌన్స్ చేయడంతో హైప్ ఓ లెవల్ లో పెరిగింది.

అదే సమయంలో ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ‘వార్ 2’ విడుదల కానుండటంతో బాక్సాఫీస్‌ దగ్గర గట్టి పోటీ కనిపిస్తోంది. కానీ ఈ పోటీ రజినీ సినిమాకు నెగటివ్ కాకుండా, మరింత పాజిటివ్ బజ్‌ను తీసుకొచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ థియేట్రికల్ రైట్స్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే రెస్పాన్స్ ఎక్కువే కనిపించింది. తాజా సమాచారం ప్రకారం తెలుగు డబ్బింగ్ హక్కులు ఏకంగా రూ.40 కోట్లకు అమ్ముడుపోయాయి.

ఈ రేటు రజినీ కెరియర్‌లోనే కాకుండా కోలీవుడ్ నుంచి తెలుగు మార్కెట్‌కు వచ్చిన చిత్రాలన్నింటిలోనూ అత్యధికంగా నిలిచింది. గతంలో విజయ్ ‘లియో’ రూ.20 కోట్లకు, సూర్య ‘కంగువ’ రూ.25 కోట్లకు, రజినీ ‘జైలర్’ రూ.17 కోట్లకు మాత్రమే అమ్ముడవ్వగా.. ఈసారి మాత్రం ‘కూలీ’ వాటన్నిటికీ రికార్డ్ బ్రేక్ చేసింది. ఇది రజినీ స్టామినాను, అలాగే లోకేష్ బ్రాండ్ విలువను మరోసారి రుజువు చేస్తోంది.

ఇకపోతే, ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ అప్పీల్, స్టార్ క్యాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ అన్నీ కలసి రావడంతో ‘కూలీ’ ఒక హై వోల్టేజ్ ప్యాకేజీగా మారుతోంది. తెలుగు ప్రేక్షకుల్లో రజినీకి ఉన్న పాపులారిటీ, ఇటీవలి ‘జైలర్’ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బిజినెస్ పరంగా ఎప్పుడో విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, కంటెంట్ పరంగా కూడా సాలిడ్ ఇంపాక్ట్ చూపిస్తే… ఇది రజినీకి మరో బ్లాక్‌బస్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.