ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశించిన ఫలితాలు అందుకోలేక నిరాశకు గురవుతోంది. ఆరంభంలో జైత్రయాత్రలా కనిపించిన ఆరెంజ్ ఆర్మీ, ఒక్కో మ్యాచ్‌తో వెనుకబడుతోంది. ఐదు మ్యాచుల్లో నాలుగు ఓటములు చవిచూసిన హైదరాబాద్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. అయితే, ఈ ఓటములకు బ్యాటింగ్ వైఫల్యం కాదు, అసలు కారణం బౌలింగ్ విఫలం అని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
“సన్‌రైజర్స్ మిడిల్ ఓవర్లలో మ్యాచ్‌ను కట్టిపడేసే బౌలర్లు లేరు” అంటూ స్పష్టంగా చెప్పారు. గుజరాత్ టైటాన్స్ గెలుపు వెనక రషీద్ ఖాన్, సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్ల బౌలింగ్ కీలకం అయిందని, అలాంటి ప్రభావవంతమైన స్పెల్స్ SRH బౌలర్ల నుంచి కనిపించడం లేదన్నారు. ప్రత్యర్థులను డిఫెన్స్‌లో ఉంచే ప్రయత్నమే తప్ప, వికెట్లు తీసే ఆగ్రెస్ బౌలింగ్ చేయడం లేదని విమర్శించారు. ఇలాంటి ధోరణితో ఐపీఎల్ మ్యాచ్‌లు గెలవడం అసాధ్యమని తేల్చేశారు.
అభిషేక్ శర్మ ఫామ్‌పై వస్తున్న విమర్శలపై కూడా రాయుడు స్పందించారు. “ఆందోళన అవసరం లేదు. మైండ్‌సెట్ మార్చుకుంటే చాలు. చిన్న చిన్న బౌండరీలు కొడుతూ వేగంగా ఆడితే ఫార్మ్‌లోకి వస్తాడు. బెసిక్స్ మీద దృష్టిపెట్టి బ్యాటింగ్, బౌలింగ్‌ను సమతుల్యం చేస్తే SRH తిరిగి పుంజుకోవచ్చు” అంటూ ధైర్యం చెప్పారు. టాప్ ఆర్డర్‌లో ఉన్న బ్యాటర్లు ఎంతో టాలెంట్ ఉన్నవాళ్లే అన్నారు.
ఇక కావ్య పాపకు మేనేజ్‌మెంట్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత SRH ఒక్కసారి జయమార్గంలోకి రావడం, మళ్లీ వరుస ఓటములతో ఊహించని పరిస్థితికి చేరడం.. పట్ల అభిమానుల్లో కూడా ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో రాయుడు ఇచ్చిన సలహాలు, విశ్లేషణలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మరి SRH మేనేజ్‌మెంట్ ఈ సూచనలను పట్టించుకుంటుందా? తదుపరి మ్యాచ్‌ల్లో ఏమైనా మార్పులు కనిపిస్తాయా? అనే ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది.