Indian Markets: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలు మరోసారి ప్రపంచ మార్కెట్లను దారుణంగా దెబ్బకొట్టాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే భారత స్టాక్ మార్కెట్లు భయంకరంగా పతనమయ్యాయి. కేవలం పది సెకన్ల వ్యవధిలో మదుపర్ల సంపద రూ.20 లక్షల కోట్లు ఆవిరయ్యింది. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ వార్, మాంద్యం భయాల నేపథ్యంలో ఈ షాక్ తగిలింది.
సెన్సెక్స్ 3,900 పాయింట్లకుపైగా పతనమవడం, నిఫ్టీ 1,150 పాయింట్లు కుంగిపోవడం ఈ సంవత్సరం లార్జెస్ట్ ఫాల్‌గా రికార్డు అయింది. ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ 10 శాతం వరకు పడిపోవడం మరింత కలవరపాటు కలిగించింది. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులో రూ.20 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఇది 2020 తర్వాతి కాలంలో మార్కెట్‌కు తగిలిన అతిపెద్ద గండిగా చెబుతున్నారు.
ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతూ, కంపెనీల లాభాల్లో నష్టాలు వచ్చే అవకాశాన్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారుల నమ్మకంలో కోత వచ్చే అవకాశం ఉండటంతో మాంద్యానికి అడ్డుదారి పడుతోందని వారంటున్నారు. జేపీ మోర్గాన్ ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 60 శాతం మాంద్యం వచ్చే అవకాశముందని అంచనా వేసింది. దీంతో మదుపర్లలో అసహనం, ఆందోళనలు పెరిగిపోయాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐలు) గత కొన్ని రోజుల్లో భారీగా అమ్మకాలకు దిగారు. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు రూ.13,730 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయించారని రిపోర్టులు చెబుతున్నాయి. ఇక మరోవైపు రిజర్వ్ బ్యాంక్ త్వరలో తీసుకోబోయే ద్రవ్య పరపతి నిర్ణయాల నేపథ్యంలో కూడా మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా మార్కెట్ దిశకు స్పష్టత లేకపోవడం, గ్లోబల్ మాంద్యం భయాలు కలిపి భారత మార్కెట్లపై పతన ప్రభావం చూపిస్తున్నాయి.