భారత రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీకి ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పార్టీకి ఇప్పుడు కొత్త నేత లభించారు. సీపీఎం 24వ అఖిల భారత మహాసభల సందర్భంగా, తమిళనాడులో జరిగిన సమావేశంలో ఎంఏ బేబీని ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తూ అధికారికంగా ప్రకటన వెలువడింది. సుదీర్ఘ కాలంగా పార్టీకి హోల్‌టైమర్‌గా పని చేస్తూ వచ్చిన బేబీకి ఈ పదవి దక్కడం సహజంగా కనిపించవచ్చు. కానీ, పార్టీ అంతర్గతంగా జరిగిన చర్చల తర్వాతే ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఎంఏ బేబీ కేరళ రాష్ట్రానికి చెందిన అనుభవజ్ఞుడైన నాయకుడు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన సేవలు గణనీయమైనవే. కమ్యూనిస్టు భావజాలాన్ని తన కుటుంబంతో పాటు పాటిస్తూ, పార్టీ కార్యకలాపాల్లో ఎప్పుడూ ముందుండే నేతగా బేబీకి మంచి గుర్తింపు ఉంది. గతంలో సీతారాం ఏచూరి చనిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయడానికి బేబీ ఎంపిక కావడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
ఈ పదవికి తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు పేరుతో కూడిన అంచనాలు ఉండటం విశేషం. కానీ, సామాజిక సమతుల్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈసారి మైనారిటీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయంతో ఎంఏ బేబీకి అవకాశం లభించింది. ఈ నిర్ణయం పార్టీలో ఓ సమతుల్యతను తీసుకొచ్చే విధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా, బేబీ లాంటి అనుభవం ఉన్న నేతను వేదికపైకి తీసుకొచ్చినందుకు పార్టీకి మద్దతు పెరగవచ్చని భావిస్తున్నారు.
ప్రధాన కార్యదర్శి పదవికి అధికారిక హోదా లేకపోయినా, పార్టీ పరంగా ఇది అత్యంత కీలకమైన స్థానం. దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ పరంగా జరిగే అన్ని నిర్ణయాల్లో ఆయనే కీలక పాత్ర పోషించనున్నారు. విమాన ప్రయాణాలు, సదుపాయాలు, సమావేశాల్లో పాల్గొనడమూ.. పార్టీ భాద్యతగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ చర్చల సందర్భంలోనూ ఆయనే పార్టీ తరఫున హాజరవుతారు. మొత్తానికి సీపీఎంకు కొత్త కెప్టెన్ ఎంఏ బేబీతో మరో కొత్త దశ మొదలయ్యిందని చెప్పవచ్చు.