హజ్ యాత్ర సమీపిస్తున్న వేళ సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి హజ్‌కు సక్రమ రిజిస్ట్రేషన్ లేకుండా వస్తున్న యాత్రికులపై కఠిన ఆంక్షలు అమలు చేయనుంది. ఇందుకు భాగంగా 14 దేశాల పౌరులకు తాత్కాలికంగా వీసా జారీని నిలిపివేసింది. ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాలపై ఈ నిషేధం వర్తిస్తుంది. హజ్‌కు ముందు ఏర్పడే భారీ రద్దీ, గతేడాది జరిగిన దుర్ఘటనల నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
గత సంవత్సరం హజ్ సమయంలో రిజిస్టర్ కాని యాత్రికులు అధికంగా రావడంతో తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా 1200 మందికిపైగా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణంగా సరైన డేటా లేకపోవడం, వీసా వాలిడేషన్ లేకుండా వచ్చిన యాత్రికులే కారణమని సౌదీ ఆరోపిస్తోంది. ఈ దారుణాన్ని పునరావృతం కాకుండా చూడాలని సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశించినట్టు సమాచారం.
ఈసారి హజ్‌ను గౌరవంగా, భద్రంగా నిర్వహించేందుకు వీసా ప్రక్రియలో కఠిన నియమాలు అమలు చేయనున్నారు. వీసా కోసం దరఖాస్తు చేసే వారు తప్పనిసరిగా అధికారిక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. హజ్‌కు ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు, దౌత్యవేత్తలకు, సౌదీలో నివాసంగా ఉండే వారికి మాత్రం ఈ నిబంధనలు వర్తించవు. కానీ ఇతరులపై మాత్రం ఈ తాత్కాలిక నిషేధం కొనసాగనుంది.
వీసాలపై తాత్కాలిక నిషేధం విధించిన దేశాల్లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఈజిప్ట్, నైజీరియా, సూడాన్, అల్జీరియా, ట్యునీషియా, యెమెన్, జోర్డాన్, ఇథియోపియా, మొరాకో, ఇరాక్ ఉన్నాయి. ఈ దేశాల పౌరులకు అధికారిక లెవల్లో ముందుగానే హజ్‌కు నమోదు చేసుకున్న వారు తప్ప వీసా దొరక్కపోవచ్చు. హజ్‌కు వెళ్లే యాత్రికులు అధికారికంగా నమోదు చేయాల్సిన అవసరం ఉన్నదని, తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా వచ్చిన కోటాలోనే వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.