Panchatantra Kathalu Review: పంచ‌తంత్ర క‌థ‌లు సినిమా ఎలా ఉందంటే?

సినిమా: పంచతంత్ర కథలు

స్క్రీన్ ప్లే – డైరెక్టర్: గంగానమోని శేఖర్

నటీనటులు: నందిని రాయి, నోయెల్ సేన్, సాయి రోనాక్, గీత భాస్కర్, నిహాల్ కోదాటి, ప్రణీత పట్నాయక్

ఐదు వేరు వేరు క‌థ‌లతో ఆంథాల‌జీగా తెర‌కెక్కిన చిత్రం పంచ‌తంత్ర క‌థ‌లు. మ‌ధు క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త డి.మ‌ధు నిర్మించారు. గంగ‌న‌మోని శేఖ‌ర్ ద‌ర్శ‌కుడు. నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఇప్పటికే , ట్రైల‌ర్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి నీతిని బోధించినదో చూద్దాం పదండి…

కథ, కథనం విశ్లేషణ: బాల్యంలో మ‌నం పంచ‌తంత్ర క‌థ‌లు పుస్తకం చ‌దువుకుని… వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్నాం. అలాంటి క‌థ‌ల ఇన్సిపిరేష‌న్ తో తెర‌కెక్కిన ఈ పంచ‌తంత్ర క‌థ‌లు మూవీ నుంచి కూడా నిజ జీవితంలో బ‌త‌కడానికి ఎంతో కొంత నీతిని ప్రేక్ష‌కులు నేర్చుకునే థియేట‌ర్ నుంచి వెళ‌తారు అన‌డంతో సందేహం లేదు. ఇందులో వున్న మొత్తం ఐదు క‌థ‌ల్లో ప్ర‌తి దాని నుంచి కూడా ఏదో ఒక నీతి సూత్రాన్ని మెసేజ్ రూపంలో చూపించారు. మొద‌టి క‌థ‌లో… కులాల మ‌ధ్య వుండే అంత‌రాల‌తో ఎలాంటి పోక‌డ‌ల‌తో స‌త‌మ‌త‌మవుతోందనేది రోజూ చూస్తూనే వున్నాం. దాన్ని తొల‌గించాల‌నే ఉద్దేశంతో మ‌నం చేసే వృత్తుల వ‌ల్ల కులాల‌ను నిర్ణ‌యించారని, వాటి వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగంలేద‌ని ఇద్ద‌రి ప్రేమికుల‌ను ఒక‌టి చేసే క్ర‌మంలో పెద్ద‌ల‌కు వివ‌రించి చెప్పారు. కుల వృత్తులు మ‌నం సృష్టించుకున్న‌వి… కులాంత‌రాల‌ను ఈ ఆధున‌కి యుగంలోనూ ప‌ట్టించుకోవ‌డం ఏంటనేది చెప్పారు. అలానే అహ‌ల్య క‌థ‌లో… ఆది నుంచి ప‌డుపు వృత్తిలో కొన‌సాగుత‌న్న మ‌హిళ‌… ఆ వృత్తికి ఎంత దూరంగా వుండాల‌ని ప్ర‌య‌త్నించినా… ఆ మార్పును స‌మాజం అంగీక‌రించ‌ద‌ని, అందుకు ఓ పెద్ద యుద్ధ‌మే చేయాల‌నేది ఎంతో హృద‌య విదార‌కంగా చూపించారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లో న‌మ్ముకున్నోళ్ల‌ను మోసం చేయొద్దు… అనేది చూపించారు. వేగంగా పెరిగిపోతున్న ఈ ఆధునిక టెక్నాల‌జీ యుగంలో ఎంత‌ జాగ్ర‌త్త‌గా వుండాలో చెప్పేదే న‌ర్త‌న‌శాల‌. ముఖ్యంగా అటు వైపు ఎవరు… ఎలాంటి వారున్నార‌నేది చూడ‌కుండా కేవ‌లం వాయిస్ ను బ‌ట్టి.. అమ్మాయి అని మోస‌పోయే యువ‌కుల‌ను చాలా మందిని నిత్యం చూస్తూనే వున్నాం. అలాంటి వారికి ఈ న‌ర్త‌న‌శాల క‌థ న‌చ్చుతుంది.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే… మొద‌టి క‌థ‌లో క్ష‌వ‌ర వృత్తి చేసే యువ‌కుడు కృష్ణ పాత్ర‌లో నిహాల్… బాగా చేశాడు. అత‌నికి జోడీగా సదియ అన్వర్… సత్య పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించింది. ఈ జంట తెరపై చూడ ముచ్చటగా ఉంది. అలాగే రామ్ మిరియాల పాడిన నేనేమో మోతెవరి పాట ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది.

సాంకేతిక నిపుణుల: ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ‌లు… వాటిని న‌డిపించ‌డానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి. వీటికి త‌గ్గ‌ట్టు అజార్ షేక్ రాసిన సంభాష‌ణ‌లు బాగా కుదిరాయి. ముఖ్యంగా మారాలంటే యుద్దమే చేయాలి…అనే డైలాగ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్ర‌తి క‌థ నుంచి ఓ నీతి సూత్రం… నేటి స‌మాజానికి త‌గ్గ‌ట్టుగా చెప్ప‌డం బాగుంది. స‌య్య‌ద్ క‌మ్రాన్ అందించిన సంగీతం చిత్రానికి బాగా ప్ల‌స్ అయింది. ముఖ్యంగా పాట‌లు బాగున్నాయి. చిత్ర ద‌ర్శకుడు గంగ‌న‌మోని శేఖ‌ర్ యే సినిమాటోగ్రాఫ‌ర్ కావ‌డంతో మంచి విజువ‌ల్స్ తీశారు. దీనికి మ‌రో సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల కూడా త‌న వంతు స‌హ‌కారం అందించారు. ఎడిట‌ర్‌ శ్రీ‌నివాస్ వ‌ర‌గంటి ఎడిటింగ్ బాగుంది. సాధారణంగా తమ ఫస్ట్ మూవీకి నిర్మాత ఎలాంటి రిస్క్ లేని కమర్షియల్ ఫార్మాట్ ఎంచుకుంటారు. కానీ ఈ చిత్ర నిర్మాత డి. మ‌ధు… తొలి అటెంప్ట్ లోనే మంచి క‌థ‌ను ఎంచుకుని ఈ పంచ‌తంత్ర క‌థ‌లు తీయ‌డం అభినంద‌నీయం. నేటి స‌మాజంలో పోక‌డ‌ల‌ను దృష్టిలో వుంచుకుని ఆడియ‌న్స్ కి ఎంతో కొంత మెసేజ్ ఇవ్వాల‌నే ఉద్ద‌శంతో ఈ చిత్రాన్ని మంచి సాంకేతిక నిపుణ‌ల‌తో క్వాలిటీ నిర్మాణ విలువ‌ల‌తో తెర‌కెక్కించారు.

చివరి లైన్: పంచతంత్ర కథలు నిన్ను నీకే చూపిస్తుంది.

రేటింగ్: 3/5