దీపావళి అంటేనే ప్రతి ఇంట్లో వెలుగుల సందడి, కొత్త బట్టల ఆనందం, స్వీట్ల మాధుర్యం. రాత్రిళ్లు టపాసుల శబ్దం గుర్తుకు వస్తాయి. ఈ దీపాల పండగ సమయంలో చక్కెర తో చేసిన వంటకాల సువాసన ప్రతి వీధిలోనూ పండుగ జోష్‌ని మరింత పెంచేస్తుంది. చిన్న స్వీట్స్ బాక్స్‌ల నుండి పెద్ద గిఫ్ట్ హ్యాంపర్స్ వరకు అందరూ ఏదో ఒక మిఠాయి ప్యాక్‌తో పండుగను జరుపుకుంటారు. కానీ ఈసారి జైపూర్‌లో ఓ స్వీట్ మేకర్ మాత్రం పండుగ రుచికి రాజసం జోడించాడు. ఎందుకంటే అక్కడ బంగారంతో స్వీట్ తయారు చేసి అమ్ముతున్నారు. 24 క్యారెట్ల తినదగిన బంగారంతో దీనిని తయారు చేశారు.
జైపూర్ లోని ఒక ప్రముఖ స్వీట్‌మేకర్ ‘స్వర్ణ భస్మ’ పేరుతో ప్రత్యేక స్వీట్స్‌ను తయారు చేస్తున్నాడు. వీటిలో 24 క్యారెట్ తినదగిన బంగారం మాత్రమే కాకుండా కుంకుమ పువ్వు, బాదం, శ్రేష్ఠమైన ఆయుర్వేద పదార్థాలు కూడా ఉపయోగిస్తున్నారు. రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలనూ కలిగించేలా ఈ స్వీట్స్ రూపుదిద్దుకుంటాయి. అందుకే ఇవి సాధారణ స్వీట్స్ కాదని, ఒక ప్రత్యేకమైన ‘రాయల్ ట్రీట్’గా పేరు తెచ్చుకున్నాయి.
ఈ గోల్డ్ స్వీట్స్‌కి డిమాండ్ ఆకాశాన్నంటుతోంది. కేవలం జైపూర్‌లోనే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఒక్క కిలో స్వీట్స్ ధర రూ.1.11 లక్షలు కావడంతో ఇవి ప్రస్తుతం ఇండియాలో అత్యంత ఖరీదైన స్వీట్స్‌గా గుర్తింపు పొందాయి. తినడానికి సురక్షితంగా ఉండే బంగారాన్ని పలుచటి లేయర్‌ల రూపంలో స్వీట్స్‌పై అలంకరించడం ద్వారా అద్భుతమైన లుక్‌తో పాటు ప్రీమియం ఫీల్‌ని ఇస్తోంది.
సోషల్ మీడియాలో ఈ గోల్డ్ స్వీట్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు ఇదే నిజమైన లగ్జరీ డెజర్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు దీన్ని దీపావళికి గిఫ్ట్‌గా ఇవ్వాలని ఆలోచిస్తున్నారని కూడా చెబుతున్నారు. బంగారం ధరలు పెరుగుతున్న వేళ.. బంగారంతో చేసిన స్వీట్స్ గిఫ్ట్ చేస్తే ఎంత స్పెషల్‌గా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.
ఈ స్వీట్స్ ప్రత్యేకత ఏంటంటే రుచి, అందం, ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఒక్కటే ప్యాక్‌లో దొరుకుతాయి. శ్రద్ధగా తయారు చేసే ఈ స్వీట్స్‌కి ముందుగానే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఒక్కో బాక్స్‌లో తక్కువ పరిమాణంలోనే ప్యాక్ చేస్తున్నా, దానికి ఉన్న క్రేజ్ మాత్రం భారీగానే ఉంది.
