దీపాల పండుగ వచ్చేసింది. ఆ వెలుగుల పండుగలో భాగంగా బ్రహ్మముహూర్తంలో అభ్యంగన స్నానం చేయడం అత్యంత పవిత్రమైన ఆచారంగా పరిగణిస్తారు. ఈ స్నానం ద్వారా శరీరం మాత్రమే కాదు, మనసు కూడా పవిత్రమవుతుందని విశ్వాసం ఉంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని నేటికీ కోట్లాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాటిస్తుంటారు. దీని వల్ల దరిద్రం దూరమై, ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తాయని పండితుల విశ్వాసం.
ఈ స్నానానికి ముందుగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి. నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెలో కొద్దిగా పసుపు, కుంకుమ, తులసి ఆకులు వేసి సిద్ధం చేయాలి. తల నుంచి పాదాల వరకు నూనె రాసుకుని మర్దన చేయడం అత్యవసరం. ముఖ్యంగా తలకు నూనె రాసుకోవడం తప్పనిసరి. ఈ సమయంలో “లక్ష్మీ కటాక్షం కలగాలి, పాపాలు తొలగిపోవాలి” అని మనసులో ప్రార్థించడం ఆచారంగా ఉంటుంది. నూనె రాసుకున్న తర్వాత కనీసం 15 నుండి 30 నిమిషాలు వేచి స్నానానికి వెళ్ళడం శుభప్రదం.
సబ్బు వాడకూడదు. శనగపిండి, పెసరపిండి లేదా సున్నిపిండితో శరీరాన్ని రుద్దుకుని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. సాధ్యమైతే ఆ నీటిలో తులసి ఆకులు లేదా కొద్దిగా గంగాజలం కలపడం శుభప్రదంగా భావిస్తారు. ఈ స్నాన సమయంలో “గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ. నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు” అనే పవిత్ర మంత్రాన్ని జపించడం వలన స్నానానికి అధిక ఫలితముంటుందని నమ్మకం.
స్నానం అనంతరం కొత్త లేదా శుభ్రమైన దుస్తులు ధరించి దేవుని గదిలో దీపం వెలిగించి పూజ చేయాలి. ఈ స్నానాన్ని సూర్యోదయం కంటే ముందు లేదా కనీసం సూర్యోదయం సమయానికల్లా ముగించాలి. సూర్యాస్తమయం తర్వాత అభ్యంగన స్నానం చేయరాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్నానంతో నరక భయం తొలగిపోతుందని, లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని విశ్వాసం.
పండితుల అభిప్రాయం ప్రకారం ఈ అభ్యంగన స్నానాన్ని కేవలం దీపావళి, నరకచతుర్ధశి నాడు మాత్రమే కాకుండా.. ధన త్రయోదశి నాడు కూడా చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు ఆధ్యాత్మిక శుభాలను కలిగిస్తుంది. చర్మానికి నూనె మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరం తేలికగా, ఉల్లాసంగా మారుతుంది. దీపావళి వేళ స్నానం కేవలం ఆచారం కాదు.. అది ఆత్మశుద్ధికి సంకేతం. వెలుగుల పండుగలో ఈ పవిత్ర స్నానం చేసేవారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, కొత్త సంవత్సరానికి శుభారంభం అవుతుందని విశ్వాసం.
