ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి… లేదంటే చాలా నష్టపోతారు..?

సాధారణంగా ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోటు మీద రాస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషి మాట కన్నా ఈ ప్రామిసరీ నోటు చాలా విలువైనది. అందుకే అప్పు ఇచ్చేటప్పుడు లేదా ఏవైనా పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకునేటప్పుడు ప్రామిసరీ నోట్ మీద రాసి ఒప్పందం చేసుకుంటారు. ఇలా ప్రామిసరీ నోటు మీద రాత రూపంలో రాసుకుంటే వారు ఇచ్చిన మాటకి ఎప్పటికైనా విలువ ఉంటుంది. అయితే ఈ ప్రామిసరీ నోటు కూడా ఎలా పడితే అలా రాయకూడదు. ప్రామిసరీ నోటు రాయటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ముఖ్యంగా ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

• అప్పు ఇచ్చే సమయంలో ప్రామిసరీ నోటు మీద ఒప్పందం రాసుకోవడానికి ఇచ్చేవాళ్ళు అప్పు తీసుకునే వాళ్ళు ఇద్దరికీ కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి.
• అలాగే ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఇచ్చే వాళ్ళు తీసుకునే వాళ్లతో పాటు కొందరు సాక్షులు కూడా అక్కడ ఉండాలి.
• ప్రామిసరీ నోట్ చెల్లే వ్యవధి మూడు సంవత్సరాలు. ఆ ప్రామిసరీ నోట్ మీద రెవెన్యూ స్టాంప్ అంటించి దానిపై అడ్డంగా సంతకం చేయాలి.
• ఇలా ప్రామిసరీ నోట్ రాసుకొని దాదాపు కోటి రూపాయల వరకు కూడా అప్పు ఇవ్వవచ్చు.
• అయితే ఇలా ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు అక్కడ న్యాయవాదిని ఉంచటం మంచిది.
• ఇక ప్రామిసరీ నోటులో నేను ఫలానా వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాను. తిరిగి ఆ వ్యక్తి కి లేదా తను సూచించిన మరో వ్యక్తి కి గాని అప్పు తిరిగి ఇచ్చేస్తాను అనే పాయింట్ లేకపోతే ఆ ప్రామిసరీ నోట్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
• అలాగే మతిస్థిమితం లేని వ్యక్తులు రాసిన ప్రామిసరీ నోటు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
• అప్పు తిరిగి చెల్లించకపోతే ఈ ప్రామిసరీ నోట్ ఆధారంగా చూపించి న్యాయబద్ధంగా వారి వద్ద అప్పు వసూలు చేయవచ్చు.
• ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు అప్పు ఇచ్చేవాళ్ళు తీసుకునే వారితో పాటు సాక్షులు కూడా అందులో సంతకాలు పెట్టాలి.