ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ టెక్నాలజీని ఉపయోగించుకొని మంచి పనులతో పాటు నేరాలకు కూడా పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది సైబర్ నేరాలకు పాల్పడుతూ అధిక మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది ఈ సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ప్రస్తుత కాలంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పెరగటం వల్ల ఈ నేరాలు ఎక్కువ అవుతున్నాయి.దీంతో చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటున్నాయి.
తాజాగా దేశంలోని అతిపెద్ద కార్పోరేట్ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్లకు ఈ మోసాలపై హెచ్చరికలు జారీ చేసింది. కొంతకాలంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు పాన్ కార్డ్ అప్‌డేట్, కేవైసీ వంటి మెసేజ్‌లు మెసేజ్ లు పంపుతూ కస్టమర్లను బురిడీ కొట్టించి నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారు. ఇటీవల ఈ మెసేజ్‌లపై స్పందించిన బ్యాంక్ ఇవన్నీ ఫేక్ మెసేజ్‌లని స్పష్టం చేయడంతో పాటు అలాంటి మెసేజ్లు వచ్చేటప్పుడు వాటిలో ఉన్న లింక్ పై క్లిక్ చేయకండని కస్టమర్లను హెచ్చరించింది. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఎటువంటి నేరాలు జరగకుండా అరికట్టవచ్చు.
సైబర్ నేరాలకు చెక్ పెట్టడానికి పాటించవలసిన చిట్కాలు :
• అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
• నెట్ బ్యాంకింగ్ సమాచారాన్ని నమోదు చేస్తున్న పేజీలో తప్పనిసరిగా https:// ఉండాలి. ఇందులో s అంటే సెక్యూరిటీ అని అర్థం. ఇది https://తో ప్రారంభం కాకపోతే సమాచారాన్ని నమోదు చేసే ముందు జాగ్రత్త వహించాలి.
• అలాగే ఏదైనా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసే ముందు అధికారిక వెబ్‌సైట్‌లోని నంబర్‌ను క్రాస్ చెక్ చేయండి.
• అలాగే మీ కంప్యూటర్‌లో యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండండి.
• ఇక ఎల్లప్పుడూ మీ క్రెడిట్, డెబిట్ కార్డ్, బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌లను తనిఖీ చేయటం చాలా ముఖ్యం.
• అలాగే ఇమెయిల్ లేదా మెసేజ్ ద్వారా పాన్ ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేయమని బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ సలహా ఇవ్వదని గుర్తుంచుకోండి.
• ఇలాంటి మెసేజ్ వచ్చినప్పుడు వెంటనే బ్యాంకు ని సంప్రదించటం చాలా ముఖ్యం.