రాజకీయాల్లో విమర్శలు సహజం.! అన్నదమ్ముల మధ్య కూడా రాజకీయ విభేదాలుండొచ్చు. అన్న చెల్లెళ్ళ మధ్య రాజకీయ విభేదాలు వుంటే, తప్పు పట్టాల్సిన పనిలేదు. వైఎస్ జగన్ ఓ పార్టీలో వున్నారు.. వైఎస్ షర్మిల ఇంకో పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించుకున్నంతవరకు తప్పేమీ లేదు.! కానీ, అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయం జుగుప్సాకరంగా మారితే.? సభ్య సమాజం హర్షించని విధంగా బూతుల పర్వం నడిస్తే.? వైఎస్ జగన్ నేతృత్వంలోని అధికార వైసీపీ నుంచి బూతుల పర్వమే నడుస్తోంది వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా.!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన సోషల్ మీడియా విభాగం వుంది. ఎవర్నయినా అత్యంత జుగుప్సాకరమైన భాషలో తిట్టడం ఈ సోషల్ మీడియా విభాగం బాధ్యత. వైఎస్ షర్మిలని కూడా వదలడంలేదు ఈ సోషల్ మీడియా విభాగం.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశాక వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ పాలనను తూర్పారబట్టారు. సరే, ఇన్నాళ్ళూ షర్మిల నోరెందుకు ఏపీ రాజకీయాల విషయమై మూగబోయింది.? అన్నది వేరే చర్చ.
వైసీపీ కూడా వైఎస్ షర్మిలని ఈ విషయమై నిలదీయొచ్చు. కానీ, బూతులతో విరుచుకుపడోతంది వైసీపీ సోషల్ మీడియా విభాగం, వైఎస్ షర్మిల మీద. రేప్పొద్దున్న కూతురికి తోడుగా వైఎస్ విజయమ్మ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుంటేనో.? ఆమె మీద కూడా వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇలాగే స్పందిస్తుందా.?
వున్నపళంగా వైఎస్ జగన్, వైసీపీ సోషల్ మీడియా విభాగంపై చర్యలకు సమాయత్తమవ్వాలి. లేదంటే, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఇలాంటి బూతు వ్యవహారాలు వైసీపీకి అశనిపాతంలా తయారవుతాయ్.!