పేదలకు ఇళ్ళ స్థలాల కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పట్టణాలు, పల్లెటూళ్ళు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నది వైఎస్ జగన్ సర్కార్ సంకల్పం. దాదాపు 30 లక్షల మంది లబ్దిదారుల కోసం ఇళ్ళ స్థలాలిచ్చే ప్రయత్నం చేస్తోంది. చాలా సంక్షేమ పథకాల విషయంలో ఎదురుకాని సమస్య, ఇళ్ళ స్థలాల విషయంలో ఎదురవుతోంది వైఎస్ జగన్ సర్కార్‌కి. లోపం ఎక్కడ జరుగుతోంది.?
‘మార్చి’ దాటేశారు.. ఏమార్చుతున్నారా.?
2020 మార్చి చివరి నాటికి (ఉగాది కానుకగా) ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నది వైఎస్ జగన్ సర్కార్ సంకల్పం. కరోనా ప్రభావం, స్థానిక ఎన్నికలు.. ఇలా పలు కారణాలతో ఆనాటి ఆ ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. నిజానికి, అప్పటికి ఇళ్ళ స్థలాల సేకరణ పూర్తిస్థాయిలో పూర్తి కాలేదు. అసలు సమస్య ఇది. కానీ, నెపం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మీదా, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మీదా.. చివరికి న్యాయస్థానాల మీదా నెట్టేస్తోంది అధికార పార్టీ. వైఎస్సార్ వర్ధంతి, జయంతి, అంబేద్కర్ జయంతి.. ఇలా పలు డెడ్‌లైన్లు ముగిశాయి.. పేదలకు మాత్రం ఇళ్ళ స్థలాలు అందలేదు.
ఆలోచన అత్యద్భుతం.. అమలులోనే సంకటం..
మామూలుగా ఓ చిన్న భూమి కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా.. అదో పెద్ద తతంగం. లిటిగేషన్లు ఎక్కువైపోతుంటాయి. అలాంటిది లక్షల ఎకరాల భూమిని సేకరించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా. కానీ, ఆ స్థాయిలో కసరత్తులు జరగలేదు. మధ్యలో అవినీతి ఆరోపణలు.. కోర్టు కేసులు.. వెరసి, ఆచరణ అలా అలా వెనక్కి వెళ్ళిపోయింది. పోనీ, అందుబాటులో వున్న ‘టిడ్కో’ ఇళ్ళు (చంద్రబాబు హయాంలో కేంద్ర సాయంతో కట్టిన ఇళ్ళు) లబ్దిదారులకు ఇచ్చారా.? అంటే అదీ లేదు. అక్కడే అసలు సమస్య మొదలవుతోంది.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది.
ఎవరి ఇల్లు.. ఎవరి సొంతం.?
‘నా ఇల్లు నా సొంతం’ అనే నినాదంతో లబ్దిదారుల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగదోసే కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. అయితే, టీడీపీ ఆశించిన స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత లబ్దిదారుల్లో కనిపించలేదు. వామపక్షాలు యాగీ చేస్తున్నాయిగానీ.. అదీ అంతే. అలాగని, జనాన్ని తక్కువగా అంచనా వేయడం ప్రభుత్వానికి తగదు. ప్రజలు ఎదురు తిరిగితే ఏ ప్రభుత్వమూ నిలబడదు. బేషజాలకు పోకుండా ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తే.. ప్రభుత్వానికి అది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది.