Home TR Exclusive జగన్మోహన విద్యుత్ షాక్ కు గురైన పచ్చ మీడియా 

జగన్మోహన విద్యుత్ షాక్ కు గురైన పచ్చ మీడియా 

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, సుప్రీమ్ కోర్టులోని కొందరు న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది.  తెలుగు మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా, కొన్ని ఆంగ్లపత్రికలు ఈ వార్తను ప్రాముఖ్యంగా ప్రచురించాయి.  కొందరు సీనియర్ న్యాయవాదులు, మాజీ న్యాయమూర్తులు జగన్ ఫిర్యాదుకు అనుకూలంగా స్పందించగా మరికొందరు ఆచితూచి స్పందించారు. 
 
Ys Jagan Mohan Reddy
 
జగన్ ఇలాంటి తెగింపుకు సిద్ధపడతాడని ఏమాత్రం ఊహించని పచ్చ మీడియా మొదటి రోజు దిగ్భ్రాంతికి లోనైనప్పటికీ మరునాటికి తేరుకుని జగన్ కు వ్యతిరేకంగా విషాన్ని కక్కడం ప్రారంభించాయి.  ఎవరెవరో ఊరుపేరు తెలియని మాజీ న్యాయవాదులను, అధికారులను వెతికి పట్టుకుని జగన్ కు వ్యతిరేకంగా తమ పత్రికల్లో వ్యాసాలు వ్రాయించాయి.  ఇంటర్వ్యూల పేరుతో జగన్ చేసిన పని కోర్ట్ ధిక్కారం అని, న్యాయవ్యవస్థను జగన్ అనుమానిస్తున్నారని, అవమానిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేయించాయి.  ఇక్కడ ఎవరో ఐదారుగురు న్యాయమూర్తులపై వ్యక్తిగతంగా జగన్ చేసిన ఆరోపణలను మొత్తం న్యాయవ్యవస్థకు ఆపాదిస్తూ జగన్ ను కఠినంగా శిక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నాయి కొందరైతే ఏకంగా జగన్ ను పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీమ్ కోర్టులో పిటీషన్లు కూడా దాఖలు చేశారంటే, జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక, కుట్రపూరితంగా పదవి నుంచి దించెయ్యాలని, ఆయన స్థానంలో చంద్రబాబును ప్రతిష్టించాలని ఎంతగా తహతహలాడుతున్నారో,   వారి అజెండా ఏమిటో ప్రజలకు అర్ధం అవుతూనే ఉన్నది.

జగన్మోహన్ రెడ్డిని తప్పించే కుట్రే ఇది 

నిజానికి న్యాయ వ్యవస్థ పట్ల జగన్ ఏనాడూ వ్యతిరేకతను వ్యక్తం చెయ్యలేదు.  తన మీద పెట్టిన కేసులు అన్నింటినీ న్యాయపరంగానే ఎదుర్కొంటున్నాడు.  న్యాయవ్యవస్థను ధిక్కరిస్తూ ఏనాడూ ఫిర్యాదులు చెయ్యలేదు.  తనకు బెయిల్ రాకుండా పదహారు నెలలపాటు నిర్బంధించినప్పటికీ, సీబీఐని కానీ, కోర్టులను    కానీ, విమర్శించలేదు.  పాదయాత్రలోకానీ, అంతకు ముందు కానీ, వారం వారం కేసు విచారణకు హాజరు అవుతూనే ఉన్నారు.    ముఖ్యమంత్రి అయినాక  కూడా సిబిఐ  కోర్టుకు  హాజరై  తన నిబద్ధతను  నిరూపించుకున్నాడు.  ఇక్కడ కొందరు న్యాయమూర్తులపై జగన్ చేసిన ఆరోపణలు వ్యక్తిగతమైనవి.   రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఆరోపణలపై విచారణ జరుగుతుందో లేదో సుప్రీమ్ కోర్ట్ నిర్ణయిస్తుంది.  సుప్రీంకోర్టు దీనిపై ఒక నిర్ణయాన్ని తీసుకోకముందే పచ్చపత్రికలు, కొందరు తెలుగుదేశం కోవర్టులు జగన్ మీద విషం కక్కుతూ రెచ్చిపోవడం ఏమిటి?   మీడియాలో ఇరవైనాలుగు గంటలూ చర్చించడం ఏమిటి?    జగన్ ను గద్దె దించాలని పిటీషన్లు వెయ్యడం ఏమిటి?  ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమేనా?  ముఖ్యమంత్రిని తొలగించడం కుదురుతుందా?  అందుకు అవకాశాలు ఉన్నాయా?  గతంలో ఎన్నడైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా?  అలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు సాధ్యం కావని తెలిసినప్పటికీ, జగన్ ను తొలగించాలని పిల్స్ వేస్తున్నారంటే దీని వెనుక భయంకరమైన కుట్ర లేదంటే ఎలా విశ్వసించాలి?  ఇలాంటి  చెట్టుకింది ప్లీడర్లు అందరికీ పోషకుడు చంద్రబాబే అనడంలో ఎవ్వరికీ సందేహాలు ఉండవు.  

కోర్టు ధిక్కరణ ఎలా అవుతుంది?

ఇక మరికొందరు మరొకరకమైన విచిత్ర వాదనలు తెరపైకి తెస్తున్నారు.  సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇచ్చిన తరువాత ఆ విషయాన్ని మీడియాకు బహిర్గతం చెయ్యడం కోర్ట్ ధిక్కరణ కిందికి వస్తుందని రంకెలు వేస్తున్నారు.  సుప్రీంకోర్టు ఆ విషయంపై ఒక నిర్ణయాన్ని తీసుకోక ముందే, తీసుకున్నదాకా వేచి ఉండకుండా పత్రికలకు ఎక్కారు, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు  అంటూ ఏమాత్రం హేతుబద్ధత లేని  అసంబద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు.      వారు గ్రహించాల్సింది ఏమిటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇచ్చారు తప్ప కోర్టులో పిటీషన్ వెయ్యలేదు.  దాన్ని కోర్ట్ విచారణకు స్వీకరించలేదు.  కోర్టులో వాదప్రతివాదాలు జరగడం లేదు.    ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దు అని ప్రధాన న్యాయమూర్తి జగన్ ను ఆదేశించలేదు.   మేము ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఇచ్చాము అని సాహసోపేతంగా జగన్ ప్రభుత్వం ప్రకటించింది.  అంతే తప్ప రహస్యంగా కుట్రలకు పాల్పడలేదు.  నలభై ఏళ్ల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు మోడీకి ఏదైనా ట్వీట్ చేసినా, లేఖ రాసినా,  వెంటనే దాన్ని తన మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు.  చివరకు రాష్ట్ర డీజీపీకి వ్రాసిన లేఖలను కూడా పత్రికలకు విడుదల చేస్తున్నారు.   ఆయన ఆ విధంగా చేస్తే లేని నేరం జగన్ చేస్తే ఎలా నేరం అవుతుంది?       కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు పత్రికలకు ఎక్కితే అది ధిక్కరణ అవుతుంది కానీ,  అలాంటిదేమీ లేనపుడు కోర్ట్ ధిక్కరణ ఎలా అవుతుంది?

ఇదేమీ మొదటిసారి కాదు

న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులను విమర్శిస్తూ ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టుకు ఫిర్యాదులు చెయ్యడం ఇదేమీ తొలిసారి కాదు అనే విషయం నిన్న మొన్న బయటకు పొక్కింది.  ఎప్పుడు అరవై ఏళ్ళక్రితమే నాటి కేరళ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్,  ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంజీవయ్య సైతం ఇలాంటి ఫిర్యాదులు చేశారట.  దీన్నిబట్టి చూస్తే అర్ధం అయ్యేది ఏమిటి?  న్యాయవ్యవస్థలో లొసుగులు ఏనాటినుంచో ఉన్నాయని, ఆనాడే కొన్ని ప్రభుత్వాలు నిరసన వ్యక్తం చేశాయని!  అప్పట్లోనే అలా ఉంటే, ఇక ఈరోజుల్లో న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు చెయ్యడంలో ఆశ్చర్యం ఏముంది?  

ఎవరూ అతీతులు కారు 

ఇక జగన్ లేఖపై విచారణ జరుగుతుందా లేదా అనేది సుప్రీంకోర్టు తేలుస్తుంది.  విచారణ జరిపించినా, జరిపించకపోయినా న్యాయవ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయని, కొందరు వ్యక్తులు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తారని, తీర్పులను తమకు కావలసిన విధంగా తెచ్చకుంటారనే సందేహాలు మాత్రం ప్రజల్లో ఏర్పడ్డాయి.  ఈ విషయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు కూడా బహిరంగంగానే కుండబద్దలు కొట్టారు.  ధనికులకు సత్వర న్యాయం లభిస్తుందని మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మీడియా ముందే స్పష్టం చేశారు.  తమకు ఆసక్తి ఉన్న కేసులను తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చే బెంచ్ ముందుకు పంపిస్తారని ఆరోపించిన న్యాయమూర్తులతో జస్టిస్ చలమేశ్వర్ కూడా ఉన్నారు.  కాబట్టి ఏ వ్యవస్థ అయినా లోపాలకు అతీతం కాదు.  లోపాలు దిద్దుకుని ప్రజలకు న్యాయం అందించడమే న్యాయస్థానాల కర్తవ్యమ్.  ఎవరో తమమీద ఆరోపణలు చేశారని నిప్పులు కక్కడం ప్రజాస్వామ్యానికి హానికరం.  ఏ వ్యవస్థలోని వ్యక్తులూ ఆకాశం నుంచి ఊడిపడలేదు.  రాజ్యాంగం ముందు అందరూ సమానమే.  “మేమూ మానవులమే.  మానవాతీతులం కాము” అని సాక్షాతూ న్యాయమూర్తులే బెంచ్ మీద కూర్చుని వ్యాఖ్యానించిన సంగతి మరువద్దు.  ఎంత మేలిమి బంగారమైనా గీటురాయి పరీక్షకు  నిలబడక  తప్పదు.   మహా సాధ్వీమణి   సీతమ్మ  కూడా శీలపరీక్షకు  నిలబడింది.
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు     
- Advertisement -

Related Posts

ఆంధ్రపదేశ్‌లో పంచాయితీ రేటు.. సూపర్ హాటు.!

పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఎలా జరుగుతాయన్నది ఓపెన్ సీక్రకెట్. వేలం పాట నిర్వహించి మరీ ఏకగ్రీవాలు చేసేయడం చాలా పంచాయితీల్లో ఆనవాయితీ. దేవాలయాల అభివృద్ధి, స్కూళ్ళ నిర్మాణం, గ్రంధాలయాల ఏర్పాటు.. ఇలాంటివన్నీ 'వేలం...

నిమ్మగడ్డను నియంత్రించిన గవర్నర్

మొన్న సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఒక ప్రముఖ నాయకురాలు ఫోన్ చేశారు.  "కోర్ట్ తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది.  ఇప్పుడు ఏమి జరుగుతుందంటారు?" అడిగారు.   "ఏముందండి?  సాయంత్రానికి డిజిపిని, చీఫ్ సెక్రెటరీని తప్పిస్తారు. ...

ఏకగ్రీవాల రగడ: వైసీపీలో మళ్ళీ అదే తొందరపాటు

అసలు వైసీపీలో ఏం జరుగుతోంది.? ఎందుకిలా తొందరపాటు వ్యాఖ్యలు, ప్రకటనలతో అభాసుపాలవుతున్నట్టు.? పార్టీని కావాలనే ఎవరన్నా వెనక్కి నెట్టేయాలని ప్రయత్నిస్తున్నారా.? ఇలాంటి అంశాలపై అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి వుంది....

చిరంజీవిని వివాదాల్లోకి లాగిన నాదెండ్ల మనోహర్

మెగాస్టార్ చిరంజీవిని రాజకీయ వివాదాల్లోకి లాగేశారు జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవే కారణమన్నది నాదెండ్ల మనోహర్ ఉవాచ. అంతేనా, పవన్...

Latest News