ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరోపక్క టీడీపీ శ్రేణులు గందరగోళంలో ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో… ఏపీ అధికార వైసీపీ చాపకింద నీరులా తమ ఎన్నికల పనులు చేసుకుంటూ పోతుంది. విపక్షాల పరిస్థితి ఎలా ఉన్నా… అస్సలు అలసత్వం ప్రదర్శించే పనికి పూనుకోవడం లేదు. ఈ నేపథ్యలో తాజాగా జగన్.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.
ఇప్పటికే గడపగడపకూ మన ప్రభుత్వ, జగనన్న సురక్ష పేరుతో జనాల్లోకి మరింతగా వెళ్లిన జగన్.. ఈ నేపథ్యంలో మరో కీలక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నాయకులకు, కార్యకర్తలకూ దిశానిర్ధేశం చేశారు. విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బస్సు యాత్రలతోపాటు మరికొన్ని కీలక కార్యక్రమాలు చెపట్టబోతున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో గతకొంతకాలంగా వినిపిస్తున్న ముందస్తు ఎన్నికలపైనా జగన్ కీలకంగా స్పందించారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు అంటూ గతకొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… కేడర్ కు జగన్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
ఇదే సమయంలో గడిచిన 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించామని తెలిపిన జగన్… 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను అమలు చేశామని తెలిపారు. ఫలితంగా… జగన్ మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు అని నిరూపించుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నామని స్పష్టం చేశారు.
అదేవిధంగా… అధికారంలోకి వస్తే పింఛన్ 3వేల రూపాయలు చేస్తామని మాటిచ్చిన జగన్.. చెప్పిన మాట ప్రకారం పెంచుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగా… జనవరి-1 నుంచి రూ.3వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. ఇదే క్రమంలో జనవరి 10 నుంచి వైఎస్సార్ చేయూత మొదలవుతుందన్నారు. జనవరి 20 నుంచి 30 దాకా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా లబ్ధిదారులకు నిధుల బదిలీ జరుగుతుందని ప్రకటించారు.
అదేవిధంగా… నవంబర్-1 నుంచి డిసెంబర్ 10 వరకు “వై ఏపీ నీడ్స్ జగన్” కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఏపీ ప్రజలకు మరింత మంచి చేయడానికి మళ్లీ జగన్ రావాలనే విధంగా ప్రచారం చేయాలని అన్నారు. అంతకంటే ముందు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 31వరకు మూడు ప్రాంతాల్లోనూ బస్సుయాత్రలు నిర్వహిస్తామని.. వీటిలో ప్రభుత్వం చేసిన సామాజిక న్యాయం, సాధికారత గురించి వివరించాలని అన్నారు.
ఇదే క్రమంలో… విపక్షాలపైనా జగన్ తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు. ఇందులో భాగంగా… రెండు సున్నాలు కలసినా నాలుగు సున్నాలు కలసినా ఏమి లాభం అని ఆయన ప్రశ్నించారు. దీంతో… పొత్తులవల్ల చివరికి అతి పెద్ద బండి సున్నా రావడం మినహా ప్రయోజనం లేదని పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు, వేసిన ప్రణాళికలు వైరల్ అవుతున్నాయి.