మోడీ రియాక్షన్ పై జగన్ ఫ్యూచర్!… తెరపైకి పశ్చాత్తాపం..?

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై జగన్ సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఈ నెల 24న ధర్నాకు సిద్ధమయ్యారు. దీంతో… వినుకొండలో జరిగిన పాశవిక ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క మోడీ అపాయింట్మెంట్ కూడా కోరారు జగన్. దీంతో… జగన్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇస్తారా, స్పందిస్తారా అనేది ఆసక్తిగా మారింది.

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… కేంద్రంలోని బీజేపీకి, జగన్ కీ తెరవెనుక మిత్రత్వం ఎప్పుడూ ఉందనే చెప్పాలి! పైకి కండిషనల్ గా పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులకు మద్దతు అని వైసీపీ ఎంపీలు ప్రకటించినా.. అది అన్ కండీషనల్ గానే అనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంటాయి. గతం సంగతి కాసేపు పక్కనపెడితే… ఇప్పుడు రాజ్యసభలో మోడీకి జగన్ అవసరం కచ్చితంగా ఉంది!

ఈ నేపథ్యంలో… జగన్ కు మోడీ అపాయింట్మెంట్ ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. వినుకొండలో జరిగిన ఘటనతో పాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో జరిగిన దారుణాలపై జగన్ వెర్షన్ వినడానికి మోడీ అపాయింట్ మెంట్ ఇస్తే.. ఏపీలో జగన్ ఈస్ బ్యాక్ అనే కామెంట్లు హల్ చల్ చేసే అవకాశం ఉంది. ఇక ఏపీలో దారుణాలపై జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

అలా కాకుండా… జగన్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వని పక్షంలో ఇది రాజకీయంగా పెనుమార్పులకు సంకేతంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. రాజ్యసభలో జగన్ సపోర్ట్ లేకుండా… మోడీ బిల్లులు పాస్ చేయించుకునే పరిస్థితి లేదు. అలా అని జగన్ ఇండియా కూటమికి మద్దతు తెలుపుతారనీ చెప్పలేని పరిస్థితి. ఇదే ఇప్పుడు జగన్ కు శాపంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రత్యర్థిగా ఉన్న పార్టీతో కేంద్రంలో తెర వెనుక జగన్ స్నేహం చేస్తున్నారంటూ వినిపిస్తున్న మాటలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. వాస్తవానికి జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తూ “ఇండియా”కూటమి పార్టీలను ఆహ్వానిస్తే అందులో తృణముల్ కాంగ్రెస్, డీఎంకే, శరద్ పవార్ పార్టీలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. వారితో జగన్ కు మంచి సంబంధాలే ఉన్నాయని అంటారు.

అయితే… మోడీతో జగన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారనే నమ్మకం ఇండియా కూటమి పార్టీల్లో బలంగా ఉంది. అందువల్ల ఈ మూడు పార్టీల వాళ్లూ జగన్ కు మద్దతు పలకాలని వ్యక్తిగతంగా ఉన్నా.. ఆచరణలో పెట్టలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ అపాయింట్మెంట్ ఇచ్చి జగన్ ఆవేదనను వింటే సరేసరి.. అది రాజకీయంగా ఏపీలో జగన్ కు చాలా ప్లస్ అవుతుందనే చెప్పాలి.

అలా కాకపోతే మాత్రం… అటు ఇండియా కూటమికి అధికారికంగా దూరంగా ఉంటూ.. ఇటు బీజేపీకి అనధికారికంగా మద్దతు పలుకుతున్నందుకు జగన్ కచ్చితంగా పశ్చాత్తాపడాల్సిందే. ఇది మోడీ & కో జగన్ కు పొడిచిన వెన్నుపోటే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ నెల 24న ఢిల్లీ వేదికగా ఏమి జరగబోతోంది.. జగన్ ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఈ వ్యవహారం ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది అనేది వేచి చూడాలి.