ముఖ్యమంత్రి జగన్ నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును జమ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యేలా నిధులు విడుదల చేసారు.
ఈ సందర్భంగా అమలాపురంలో బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో బాబు చరిత్రను గుర్తుచేస్తూ… కీలకమైన విషయాలు వెల్లడిస్తూ.. అసలు చంద్రబాబుని సీఎం ఎందుకుచెయ్యాలి అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఎంత అసమర్ధుడో చెప్పేలా కొన్ని ఉదాహరణలు తెరపైకి తెచ్చారు. కళ్లకు కట్టినట్లు చూపించారు!
అవును… చంద్రబాబుకు సీఎం కుర్చీ ఎందుకు ఇవ్వాలి”? ముఖ్యమంత్రి జగన్ డైరెక్ట్ గా వేసిన ప్రశ్న ఇది. ఇది ఆషామాషీగా వేసిన ప్రశ్న కాదు..! బాబు చరిత్రను.. సీఎం గా ఆయన పనిచేసిన అనుభవాన్ని.. ఆయన పాలనలో డొల్లతనాన్ని.. ఏకరువు పెడుతూ మళ్లీ నాలుగవసారి సీఎం కుర్చీ బాబుకు ఎందుకు ఇవ్వాలంటూ అయిదు కోట్ల మంది ఆంధ్రులను అడిగారు.
బాబు తొలిసారి సీఎం అయింది 1995లో.. అంటే ఇప్పటికి 28 ఏళ్ల ముందు! ఆ తరువాత ఆయన మూడుసార్లు ముఖ్యమంంత్రి అయ్యారు. ఇందులో భాగంగా సుమారు పద్నాలుగేళ్ల పాటు పాలించారు. ఈ సుదీర్ఘ కాలంలో బాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పధకం ఏదైనా ఉందా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. పేదలకు తాను ముప్పయి లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చాను, బాబు ఒక్క పట్టా అయినా ఇచ్చారా నిలదీశారు!
ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014 తరువాత చంద్రబాబు సీఎం అయ్యారు.. ఆ సమయంలో ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని జగన్ అడిగారు. చంద్రబాబు ఉన్నపుడు రాష్ట్రం బడ్జెట్ కూడా ఇంతేనని గుర్తుచేశారు. అప్పులు కూడా తన కంటే ఎక్కువే చేశారని తెలిపారు. అయినా ప్రజలకు తాను గత నాలుగేళ్ళలో ఇచ్చిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల డైరెక్ట్ నగదు బదిలీ పధకాన్ని ఎందుకు ఇవ్వలేకపోయారని సూటిగా అడిగారు.
చంద్రబాబు సీఎం అయితే ప్రజలకు పేదలకు ఏమి ఒరుగుతుంది, ఎవరికి లాభం అని అంటున్న జగన్… ఆయన అనుకూల మీడియాకూ, దత్తపుత్రుడుకే లాభం తప్ప ప్రజలకు ఏ మేలూ ఉండదని అన్నారు. 2014లో కూడా తన అనుకూల మీడియా, తన దత్తపుత్రుడి కోసమే పనిచేసిన బాబు సీఎంగా ఎందుకు కుర్చీ ఎక్కాలని ఆయన ప్రశ్నించారు.
ఇదే సమయంలో పవన్ పై కూడా జగన్ తనదైన విమర్శలు చేశారు. తాను సీఎం కావడానికి దత్తపుత్రుడు ప్రయత్నం చేయడం లేదని.. చంద్రబాబు సీఎం కావడం కోసం పరుగులు పెడుతున్నారని సెటైర్లు వేశారు. వీరంతా ప్రతీ రోజూ మూడేసి ప్రాంతాలలో మీటింగ్స్ పెట్టి ప్రజలకు మంచి చేస్తామని చెప్పడం లేదని.. తాము అధికారంలోకి వస్తే అందరి అంతూ చూస్తామని కక్ష తీర్చుకుంటామని అంటున్నారని జగన్ మండిపడ్డారు!
ఏది ఏమైనా… అమలాపురం సభలో చంద్రబాబుకు మళ్ళీ సీఎం పదవి ఎందుకు ఇవ్వాలంటూ జగన్ లేవనెత్తిన ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇదే సమయంలో జగన్ ఈ కొత్త అస్త్రం… రాజకీయంగా వైసీపీ పదునెక్కిన వ్యూహానికి నిదర్శనం అని అంటున్నారు.