రేపు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశం జరగబోతున్నది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ సమావేశాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరో రెండు నెలల్లో అధ్యక్ష స్థానానికి జరగబోయే ఎన్నికల గురించి చర్చించడానికి అని చెబుతున్నప్పటికీ ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని చర్చించడమే ఈ సమావేశం అజెండా అంటున్నారు. అందుకు కారణాలు ఉన్నాయి. గత రెండు మూడు నెలలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి కుమారుడు కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మామూలు ప్రజలు అనుకుంటే సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కేటీఆర్ కాబోతే ముఖ్యమంత్రి అని బహిరంగ వేదికలపై ప్రకటిస్తున్నారు. దాన్ని కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఖండించడం లేదు. వేదికలమీద మాట్లాడొద్దని కేటీఆర్ సలహా ఇచ్చారు తప్ప తాను ముఖ్యమంత్రిని కానని మాత్రం చెప్పడం లేదు. కాబట్టి అధికారమార్పిడి వార్తలకు బలం చేకూరుతున్నది.
కేటీఆర్ కు అర్హతలు ఉన్నాయా?
కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి అర్హతలు ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే “నిస్సందేహంగా” అనే జవాబు వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కొద్దిగా ఆలస్యంగా అడుగుపెట్టినా, సుమారు పదేళ్ళపాటు ఉద్యమనాయకుడుగా గుర్తింపు ఉన్నది. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓటమి అనేది ఎరుగరు. ఆరేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా ఐటి మంత్రిగా ఆయనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అనేక ఐటి పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచారు. యువతకు ఐకాన్ అనిపించుకున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. మంచి వాగ్ధాటి ఉన్నది. జ్ఞాపకశక్తి ఉన్నది. అంతేకాకుండా ప్రజాకర్షణశక్తి కలిగిన యువనాయకుడు. ముఖ్యమంత్రి పదవిని అయన సునాయాసంగా నిర్వహించగలడు. అయితే కేసీఆర్ తో పాటు చాలాకాలంగా పనిచేసిన కొందరు సీనియర్ నాయకులు కేటీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తారా అని చాలామంది సందేహిస్తున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈటల రాజేందర్, హరీష్ రావుల స్పందన ఎలా ఉంటుందనేది చాలామంది మదిని తొలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే కొంతకాలం క్రితం ఈటల రాజేందర్ కేసీఆర్ మీదనే తిరుగుబాటు చేస్తున్నారా అనిపించేవిధంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ వివాదంలో ఆయనను పదవినుంచి తొలగించే అవకాశం ఉన్నదని ఊహాగానాలు పెల్లుబికాయి. అయితే ఈటలకు ప్రజలనుంచి గొప్ప మద్దతు లభించడంతో ఆయనకు తాత్కాలికంగా పదవీగండం తప్పిందని చెప్పుకుంటారు. అలాగే హరీష్ రావుకు, కేసీఆర్ కు మధ్యన మనస్పర్థలు వచ్చాయని, అందుకే హరీష్ కు తొలిదశలో మంత్రి పదవి ఇవ్వలేదని కథనాలు వినిపించాయి. అయితే అప్పట్లో కేటీఆర్ కు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని కొందరు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి అడ్డంకులను అధిగమించి పార్టీవారిని ఒప్పించి కేసీఆర్ తాను అనుకున్నది సాధిస్తారని విశ్లేషకుల అభిప్రాయం.
మరి కేసీఆర్ ఏమి చేస్తారు?
ఒకవేళ ముఖ్యమంత్రి పదవిని కుమారుడికి అప్పగిస్తే, ఆ తరువాత కేసీఆర్ ఏమి చెయ్యాలి? రాజకీయాల పరిభాషలో కేసీఆర్ వృద్ధుడేమీ కాదు. డెబ్బై లోపలే ఆయన వయసు. ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన నాయకత్వపటిమకు ఏమాత్రం లోటులేదు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ జాతీయరాజకీయాలపై దృష్టి సారిస్తారని ఊహిస్తున్నారు. బలమైన ప్రాంతీయపార్టీలను కూడగట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తారని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం మెజారిటీ పరంగా చాలా పటిష్టంగా ఉన్నది. మోదీ ఎన్ని ప్రజా వ్యతిరేక చర్యలను చేపట్టినా, శాసనాలు చేసినా ఆయనను ప్రతిఘటించే పార్టీ అనేదే లేదు. ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసే నాయకులు కూడా కనిపించడం లేదు. మూడు నెలలనుంచి రాజధానిలో రైతుల ఉద్యమం జరుగుతున్నా రాజకీయంగా ఒక్క పార్టీ, ఒక్క నాయకుడు కూడా బహిరంగంగా మద్దతు పలికే సాహసం చేయలేకపోతున్నాడు. అలా చేస్తే మోదీ కక్ష తీర్చుకుంటారని, దేశద్రోహం కేసులు పెట్టిస్తారని, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతారని అన్ని పార్టీల నాయకులు భయపడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మిపారేస్తున్నప్పటికీ ఒక్క రాష్ట్రం కూడా ఖండించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ పాలన సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని నిర్మించడం అంటే అది అతిపెద్ద సాహసకార్యం అవుతుంది. ఎంతమంది కలిసివస్తారో చెప్పలేము. ఈ ఏడాది జరగబోతున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇక దేశంలోని అందరు నాయకులు మోదీ శరణు కోరక తప్పదు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీయే గెలుస్తుందని మొన్ననే ఏదో సర్వే నివేదిక బయటపెట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పదవీకాలం మూడేళ్లు ఉండగానే కేసీఆర్ పదవినుంచి తప్పుకుంటారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు