ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా?

Whom does the Supreme Court rule in favor of?
ఏమవుతుంది?  ఇప్పుడేమవుతుంది?  దేశం మొత్తం నరాలు తెగిపోయే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది.  ప్రజల ప్రాణాలు ముఖ్యమా?  పంచాయితీ ఎన్నికలు ముఖ్యమా?  ఇదే ఇప్పుడు అందరి మదిలో తొలుస్తున్న ప్రశ్న.  సుప్రీంకోర్టు ఏమని చెబుతుంది?  
 
రాజ్యాంగం ముఖ్యమే.  రాజ్యాంగ  వ్యవస్థలకు గౌరవం ఇవ్వడం కూడా ప్రధానమే.  కానీ ఆ గౌరవం, విలువ ప్రజల ప్రాణాలను బలిపెట్టి ఇవ్వాలా అనేది సందేహం.  అయిదు కోట్లమందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం, ఎన్నికల విధుల్లో పాల్గొనవలసిన పోలీసు, పంచాయితీ శాఖల ఉద్యోగులు, ఇతర ఉద్యోగసంఘాల వారు వ్యాక్సినేషన్ జరుగుతున్న తరుణంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులను నిర్వహించలేమని స్పష్టం చేస్తున్నాయి.  కానీ, ఒకే ఒక వ్యక్తి ఎవరో వెనుకనుంచి ఆడిస్తున్న తోలుబొమ్మలాగా ప్రజల ప్రాణాలు పోయినా సరే ఎన్నికలు నిర్వహించాల్సిందే అని మొండిపట్టు పట్టాడు. హైకోర్టు కూడా ప్రజల మొరను ఆలకించకుండా ఆ ఒక్క వ్యక్తికి మద్దతు పలికింది.  
 

Whom does the Supreme Court rule in favor of?

ఇప్పుడు ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రజల ప్రాణాలతో ఉంటె కదా రాజ్యాంగం, ప్రభుత్వాలు, పరిపాలన?  ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కొరడాదెబ్బలు కొడుతూ ఎన్నికల రంగంలోకి దించాలా లేక కరోనా సమయంలో సొంత కుటుంబసభ్యుల కన్నా ఎక్కువగా చూసుకుంటూ వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి అహర్నిశలు పాటుపడిన ప్రభుత్వ వినతిని ఆలకించాలా? సుప్రీంకోర్టు ఏమని నిర్ణయిస్తుంది?  
 
ఒకవేళ సుప్రీంకోర్టు కూడా ఎన్నికలసంఘానికే మద్దతు పలికినా ఆ ఆదేశాలను ప్రభుత్వం, ఉద్యోగులు పాటిస్తారా అని కూడా నిన్నటినుంచి చర్చలు జరుగుతున్నాయి.  ప్రజలకన్నా మాకు ఎన్నికలు ముఖ్యం కాదు అని ప్రభుత్వం ఎదురు తిరిగితే సుప్రీంకోర్టు ఏమి చెయ్యగలదు?  తమిళనాడులో జల్లికట్టు నిషేధించినప్పటికీ తమిళనాడు మొత్తం ఎదురు తిరిగి సుప్రీంకోర్టు ఆదేశాలను తిరస్కరించింది.  కర్నూల్ జిల్లాలో అనుకుంటాను…అక్కడ కర్రలతో కొట్టుకోవడం, తలలు పగలగొట్టుకోవడం లాంటి రాక్షసక్రీడలను కోర్టులు ఎన్నిసార్లు నిషేధించినా తమ సంప్రదాయాలే తమకు ముఖ్యం అంటూ కోర్టు ఆదేశాలను పాటించలేదు అక్కడి జనం.  ఇక ప్రతి ఏటా కోళ్ల పందేలను కోర్టులు నిషేధిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నప్పటికీ ఎవ్వరూ వాటిని లెక్కచేయడం లేదు.   నిన్నగాక మొన్న ఢిల్లీలో రైతుల ఆందోళనలకు సుప్రీంకోర్టు ఒక రాజీమార్గం చూపించినప్పటికీ రైతులు ఎవ్వరూ దాన్ని ఔదలదాల్చలేదు.  నిర్మొగమాటంగా తిరస్కరించారు.  రేపు లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ కూడా చేస్తున్నారు.   ఒకసారి చరిత్రను చూసుకుంటే   రాజ్యాంగవ్యవస్థలు తమ మనోభావాలను దెబ్బతీస్తూ ప్రాణాలతో చెలగాటలు ఆడుతామంటే ప్రజలు భగవంతుడిని కూడా లెక్క చెయ్యరు అని అర్ధం అవుతుంది. 
 
ఈ నేపథ్యంలో ప్రజా ప్రభుత్వాన్ని, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెబుతుందా లేక విశ్వసనీయత ఏమాత్రం లేని ఒక వ్యక్తిని సమర్ధిస్తుందా అనేది ఇప్పుడు కోటి రూపాయల ప్రశ్న.  ఎన్నడూ ఉత్పన్నం కాని ఒక రాజ్యాంగ సంక్షోభాన్ని తెలివిగా నివారిస్తుందా లేక మరింత ఆజ్యం పోస్తుందా?  కోట్లాదిమంది ఎదురు చూస్తున్న ఉద్విగ్నపూర్వక సంఘటన ఇది.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు