బీఆరెస్స్ కి షాకిచ్చిన ఈసీ… ఆప్ కి గుడ్ న్యూస్ చెప్పింది!

2019 నుంచి కోవిడ్ కారణంగా కాస్త పనులు పెండింగులో పెట్టిన ఎన్నికల కమిషన్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా భారి భారీ పార్టీలకు సైతం భారీ షాక్ లే ఇచ్చింది. ఇందులో భాగంగా… దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీకి సైతం జాతీయ ఎన్నికల కమిషన్ షాకిచ్చింది.

అవును… పశ్చిమ బెంగాల్‌ లోని అధికార పార్టీ “తృణమూల్ కాంగ్రెస్”, శరద్ పవార్ సారథ్యంలోని “నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ”, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) పార్టీల‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ షాకిచ్చింది. ఆయా పార్టీలకు ఇప్పటివరకూ ఉన్న జాతీయ హోదాను రద్దుచేసింది. జాతీయ హోదాకు అవ‌స‌ర‌మైన నిబంధ‌న‌లు క‌లిగి ఉండ‌టంలో ఆ మూడు పార్టీలు విఫ‌లం కావ‌డంతోనే ఆ హోదాను ర‌ద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

అదంతా ఒకెత్తు అయితే… ఆంధ్రప్రదేశ్ లో బీఆరెస్స్ కు కూడా షాకిచ్చిన ఎన్నికల కమిషన్… ఏపీలో రాష్ట్ర పార్టీ గుర్తింపును ర‌ద్దు చేసింది. 2014, 2019 ల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో బీఆరెస్స్ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ గుర్తింపును ఈసీ ఉపసంహరించింది. ఫలితంగా… ఏపీలో బీఅరెస్స్ నేతలు పోటీచేసినా… ఉమ్మడి గుర్తు లభించే ఛాన్స్ ఉండకపోవచ్చు!!

ఆ బ్యాడ్ న్యూస్ ల సంగతి అలా ఉంటే… ఆప్ కు మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది జాతీయ ఎన్నికల కమిషన్. అవును… ఇటీవల కాలంలో అనేక‌ రాష్ట్రాల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ ఓట్ల శాతాన్ని నమోదు చేసుకుంటున్న ఆం ఆద్మీ పార్టీకి జాతీయ హోదా క‌ల్పించింది. 2012లో స్థాపించిన ఆం ఆద్మీ పార్టీ.. మొదట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. ఇదే క్రమంలో… ఇత‌ర‌ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కూడా బరిలో దిగుతూ తాజాగా పంజాబ్‌ లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అదేవిధంగా… గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ లో జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. ఈ క్రమంలో గుజరాత్‌ లో ఐదు అసెంబ్లీ స్థానాలు, 12 శాతం ఓట్లు సాధించింది. దీంతో… ఆప్ కు జాతీయ పార్టీకి కావాల్సిన అర్హతలు ఉన్నాయని ప్రకటించిన ఈసీ ఈ హోదాను ఇచ్చింది!

కాగా… ఏ రాజకీయ పార్టీ అయినా జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. కేంద్ర ఎన్నికల సంఘం 1968 నిబంధనల ప్రకారం నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీచేయడంతోపాటు.. లోక్‌ సభలో కనీసం 2% సీట్లు పొంది ఉండాలి. ఈ విషయంలో… తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లు ఆ క్వాలిఫికేషన్స్ సాధించలేదు!