ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికీ, రాజ్యాంగబద్ధమైన ఎన్నికల నిర్వహణ వ్యవస్థకీ మధ్య ‘యుద్ధం’ జరుగుతోందనడం బహుశా అతిశయోక్తి కాకపోవచ్చు. స్థానిక ఎన్నికల ప్రక్రియను కరోనా నేపథ్యంలో మధ్యలోనే అర్థాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చినప్పుడు కనీసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి కదా.? కానీ, ఆ పని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేయలేదు. దాంతో, ముఖ్యమంత్రికి కోపమొచ్చింది. ‘చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అక్కడి నుంచి వివాదం రోజుకో మలుపు తిరిగింది. ఎవరికి వారు తమదే పై చేయి.. అనిపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు.. ఈ క్రమంలో ఇద్దరూ అభాసుపాలయ్యారన్నది నిర్వవాదాంశం. ఇక ఇప్పుడు పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. రేపు ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ రాబోతోంది. సంబంధిత అధికారులను రావాల్సిందిగా ఎస్ఈసీ ఆదేశిస్తే, మొహం చాటేశారు. దాంతో, ఎస్ఈసీకి కోపమొచ్చింది. మరోపక్క 9 మంది అధికారులపై బదిలీ వేటు వేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ.
ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏ అధికారాలుంటాయో.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి కూడా అంతే. దాంతో, నిమ్మగడ్డ ఆదేశాల్ని ప్రభుత్వం పక్కన పెట్టే పరిస్థితి వుండకపోవచ్చు. కానీ, ఈలోగా ఏమైనా జరగొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే సుప్రీంకోర్టును ఆశ్రయించినా, సాంకేతిక కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ సుప్రీం దృష్టికి వెళ్ళలేదు. మరి, రేపయినా వెళుతుందా.? నోటిఫికేషన్ వచ్చేశాక సుప్రీంని రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయిస్తే.. సుప్రీంలో ఏమవుతుంది.? ఈ ప్రశ్నలకు న్యాయ నిపుణుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి, స్థానిక ఎన్నికలంటే ప్రభుత్వం భయపడే పరిస్థితి వుండదు. అధికార పార్టీ అసలే భయపడదు. కానీ, ఇక్కడ భయం కేవలం కరోనా కారణంగానేనన్నది అధికార పార్టీ నేతల వాదన. మరి, ప్రభుత్వం.. అధికార పార్టీ చేపడుతున్న రాజకీయ కార్యక్రమాల్లో గుంపులు గుంపులుగా కనిపిస్తున్న జనం మాటేమిటి.? అన్నది ఇంకో చర్చ. ఎవరి వాదనలు వారివే.. అంతిమంగా రెండు అతి ముఖ్యమైన వ్యవస్థల మధ్య యుద్ధంగా ఇప్పుడు పంచాయితీ ఎన్నికల వ్యవహారం మారిపోవడం శోచనీయం.