హైదరాబాద్ నగరంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అక్రమ కట్టడాలను తొలగిస్తామని చెబుతున్న అధికారులు, వ్యవస్థను సంపన్నులకు అనుకూలంగా మార్చుకుంటున్నారా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాజేంద్రనగర్ ప్రాంతంలో నిర్మాణాలను తొలగించాలంటూ అధికారులు పేద, మధ్యతరగతి ప్రజలకు నోటీసులు పంపారు.
కానీ అదే సమయంలో, మియాపూర్, దుర్గం చెరువు పరిసరాల్లోని అధిక భూములను ఆక్రమించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై హైకోర్టు కఠిన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయా? ఒక వర్గానికి ఒక రూలు, మరొక వర్గానికి వేరే రూలా? అని హైకోర్టు ప్రశ్నించింది. పేదల కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రా, పెద్ద కట్టడాల విషయంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు వ్యాఖ్యలతో హైడ్రా అధికారుల తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలు ఒకే లాంటి చర్యలు తీసుకోవాలి, లేదంటే న్యాయం కేవలం శక్తివంతులకు మాత్రమే పరిమితమైపోతుందనే భావన బలపడుతుంది. అక్రమ కట్టడాల తొలగింపు అవసరమే, కానీ అందరికీ సమాన న్యాయం జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మరి ఈ విధానంలో నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.