ఐపీఎల్‌లో ఎప్పుడూ రిస్క్ టేకింగ్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న రిషభ్ పంత్… ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున గతంలో కెప్టెన్‌గా ఉన్న పంత్… ఈ సీజన్‌లో రూ.27 కోట్ల భారీ విలువతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఈ అంకె అతని మీద ఉన్న అంచనాల్ని, జట్టు మేనేజ్‌మెంట్ పెట్టిన పెట్టుబడి స్థాయిని బట్టే చెప్పాలి. కానీ పంత్ ఆ అంచనాలన్నింటినీ మొదటి మ్యాచ్‌లోనే తలకిందులయ్యేలా చేశాడు.
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో భారీ స్కోర్ ఖాతాలో వేసింది. అయితే లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతున్నా… ఆట చివరి దశలో మ్యాచ్‌ను చేజిక్కించుకునే స్థితిలోకి వచ్చింది. చివరి ఓవర్లో మిగిలిన ఒక వికెట్… ఒక అవకాశం… అటు మోహిత్ శర్మను ఔట్ చేస్తే విజయం లక్నోది కావాల్సింది. కానీ ఆ నిర్ణయాత్మక క్షణంలో కీపర్ గా పంత్ చిన్న తప్పిదం… భారీ ధరకు దిగింది. స్టంపింగ్‌కి మోహిత్ స్పష్టంగా క్యాండిడేట్‌గా కనిపించినా… పంత్ ఆ ఛాన్స్‌ను మిస్ చేశాడు. దీంతో ఆఖరి వికెట్ కూడా కాపాడుకొని, ఢిల్లీ విజయ తీరాలకు చేరింది.
ఇది ఒక్క తప్పిదమా అనుకునేలోపే… పంత్ బ్యాటింగ్ వైఫల్యం ఇంకొక సమస్యగా నిలిచింది. అంత పెద్ద బడ్జెట్ పెట్టి తీసుకున్న ఓ కెప్టెన్ 0 పరుగులకు డకౌట్ అవుతే… ఆ షాక్ నుంచి జట్టు బయట పడటం కూడా కష్టమే. ఏ ఒక్క ఫ్యాన్‌కైనా నిరాశే. పంత్ వ్యక్తిగతంగా, జట్టుగా కూడా మొదటి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్‌లో మిస్సైన స్టంప్ మాత్రం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది.
రెండింటిలో ఏదో ఒకదానిలోనైనా పంత్ చక్కగా పోరాడితే… లక్నో విజయాన్ని అందుకునే అవకాశం ఉండేది. కానీ ఈ 27 కోట్ల విలువ చూపించాల్సిన చోట, అదృష్టాన్ని సమర్థించాల్సిన చోట… పంత్ నిరుత్సాహపరిచాడు. తొలి మ్యాచ్ అయినప్పటికీ, ఈ ఫెయిల్యూర్ వలన, మిగతా మ్యాచ్ లలో ఒత్తిడిని అతను ఎలా తట్టుకుంటాడన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న.