పోయినోళ్ళందరూ మంచోళ్ళేనన్నది పెద్దలు పదే పదే చెప్పే మాట. కానీ, బాధిత కుటుంబాలు.. తమకు జరిగిన అన్యాయాల్ని అంత తేలిగ్గా మర్చిపోయి, ‘పోయినోళ్ళందరూ మంచోళ్ళు’ అని అనలేవు కదా.! దివంగత టీడీపీ నేత పరిటాల రవికి జనం హృదయాల్లో ఎలాంటి ఇమేజ్ వుంది.? అన్న ప్రశ్నకు భిన్నమైన వాదనలు విన్పిస్తాయి. కొందరు ఆయన్ని దేవుడంటారు. ఇంకొందరాయన్ను రాక్షసుడంటారు. పొలిటికల్ ఫ్యాక్షనిజం.. అన్న పదానికి సరికొత్త నిర్వచనం చెప్పింది పరిటాల రవి.. అన్నది అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. నక్సలిజం, ఫ్యాక్షనిజం, రాజకీయం.. ఇలా మూడిటినీ కలగలిపేశారు పరిటాల రవి. అయితే, ఆయన కూడా ఆ కక్షలు, కార్పణ్యాలు, రాజకీయాలకే బలైపోయాడనుకోండి.. అది వేరే సంగతి. ఇప్పుడు ఆనాటి ఆ కర్కశత్వం ఎందుకు ప్రస్తావనకు వస్తోందంటే, పరిటాల రవి.. అనంతపురం పొలాల్లో రక్తపుటేరులు పారించారంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించడం వల్లనే.
గోరంట్ల మాధవ్‌పై పరిటాల కుటుంబం రివర్స్ ఎటాక్
పరిటాల రవి గురించి మాట్లాడేముందు, నీ మీద ఎన్ని కేసులున్నాయో చూసుకో.. అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు గోరంట్ల మాధవ్ మీద. ‘ఆయన మీద అత్యాచారం కేసు వుంది.. పైగా ఆయన మీద వున్న కేసులన్నిటినీ అఫిడవిట్‌లో పొందుపర్చారు ఎన్నికల సమయంలో.. ఆయన గురించి మేం మా స్థాయికి దిగజారి మాట్లాడలేం..’ అనేశారు పరిటాల శ్రీరాం. పరిటాల రవి తనయుడు శ్రీరామ్, పరిటాల రవి సతీమణి సునీత కూడా ఈ ఎపిసోడ్‌లో మీడియా ముందుకొచ్చారు.
పరిటాల చరిత్రలో అన్నీ వున్నాయ్..
ప్రత్యర్థుల్ని మట్టుబెట్టడం ఫ్యాక్షన్‌లో మామూలే. ఆ ఫ్యాక్షన్‌కి ఒకప్పుడు కేంద్ర బిందువైన పరిటాల రవి, చాలామంది హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పరిటాల రవి, ఎవర్నీ చంపలేదు.. చంపించలేదు.. అని రాయలసీమలో ఎవరన్నా అనగలరా.? ఛాన్సే లేదు. రాజకీయాల్లోకొచ్చి.. పదవులు చేపట్టి, ప్రజా నాయకుడిగా ముద్ర వేయించుకున్నంతమాత్రాన ఆయన పేరు మీదున్న ఫ్యాక్షన్ రక్తపు మరక చెరిగిపోదు. ఇది పరిటాల రవి అభిమానులు సైతం చెప్పే మాటే.
గోరంట్ల మాధవ్ ఇప్పుడెందుకు తవ్వారు.?
ఏదో యధాలాపంగా గోరంట్ల మాధవ్, పరిటాల రవి పేరుని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనుకోలేం. అత్యంత పకడ్బందీగా ఆయన ప్లాన్ చేసుకుని మరీ, పరిటాల రవిపై విమర్శలు చేశారు. బహుశా, ఆయన తన ఇమేజ్‌ని పార్టీలో మరింత పెంచుకునేందుకు, వైసీపీ అధిష్టానం మెప్పు పొందేందుకూ మాత్రమే ఆయన ఈ పని చేసి వుండొచ్చు. గతంలో పోలీస్ అధికారిగా పనిచేసిన గోరంట్ల మాధవ్.. ఆనాటి ఆ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడినంతమాత్రాన అది రాజకీయం కాకుండా ఎలా పోతుంది.?