2019 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘురామ కృష్ణంరాజు… అనతికాలంలోనే ఆ పార్టీకి స్వపక్షంలో విపక్షంలా మారిపోయారు. ఒకానొక సమయంలో.. ప్రతిపక్షంగా టీడీపీ, జనసేనలు సైతం చేతులెత్తేసినట్లు కనిపించిన సమయంలోనూ రఘురామ తన వాయిస్ ని బలంగా వినిపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే… కూటమి విజయానికి తొలుత జవసత్వాలు అందించింది ఆయనే!
కట్ చేస్తే… 2024లోనూ పార్టీ ఏదైనా, నరసాపురం ఎంపీ సీటు తనదే అని రఘురామ ధీమాగా చెప్పారు. అయితే… అటు బీజేపీ కానీ, ఇటు బాబు కానీ ఆయనకు ఎంపీ సీటు ఇవ్వలేదు.. ఢిల్లీ వెళ్తే రోడ్డుపైనే నిలబెట్టేశారు! ఈ నేపథ్యంలో.. తెరవెనుక పలువురు పావులు కదిపి, బాబుకు నచ్చచెప్పి రఘురామకు ఉండి ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించారని అంటున్నారు. ఆ స్థానం నుంచి ట్రిపుల్ ఆర్ మంచి మెజారిటీతో గెలిచారు.
ఆ సమయంలో… తనను స్పీకర్ గా చూడాలని చాలామంది ప్రజలు భావిస్తున్నారంటూ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. మరోపక్క క్షత్రియ కోటాలో కానీ.. గతంలో జగన్ ని తీవ్రస్థాయిలో విమర్శించిన కోటాలో కానీ ఆయనకు మంత్రిపదవి దక్కుతుందని చాలా మంది భావించారు.. ఆయనకూడా ఆశించారని అంటారు. అయితే… రఘురామకు బాబు మార్కు షాక్ తగలడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు!
ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి రాకపోవడంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు రఘురామ! దీంతో… బాబుపై ట్రిపుల్ ఆర్ కు తీవ్ర అసంతృప్తి, బయటకు కనిపించని ఆగ్రహం ఉన్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. దీనికి తోడు ఏపీ అసెంబ్లీలో సోమవారం ఆయనకు ఓ అవమానం కూడా జరిగిందని అంటున్నారు. దీంతో.. ఆయన స్పీకర్ కు లేఖ కూడా రాశారు. అనంతరమే… జగన్ తో కలిసి మాట్లాడినట్లు చెబుతున్నారు.
అవును… ఏపీ అసెంబ్లీ సమావేశల వేళ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుకు చేదు అనుభవం ఎదురైంది. ఇందులో భాగంగా… ఆయన కారును అధికారులు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో… ఆయన అవమానంగా ఫీలవ్వడంతోపాటు అక్కడున్న అధికారులపైనా మండిపడ్డారు. మంత్రుల కాన్వాయ్ లు మాత్రమే లోపలికి అనుమతిస్తారా అంటూ అధికారులను నిలదీశారు.
అసెంబ్లీ అంటేనే ఎమ్మెల్యేలందరినీ కలిపే ప్రాంతం అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామ. అక్కడితో ఆగని ఆయన… ఈ వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు. అసెంబ్లీలోకి తన కారును అనుమతించకపోవడంపై వివరణ ఇవ్వాలని తన లేఖలో కోరారు. ఈ నేపథ్యంలోనే… అసెంబ్లీలో జగన్ ని కలిసి ముచ్చటించినట్లు చెబుతున్నారు.
అలా బాబుకు ఝులక్ ఇవ్వాలని ట్రిపుల్ ఆర్ భావించి ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో… రఘురామ కృష్ణంరాజు విషయంలో చంద్రబాబు ఏమాత్రం లైట్ తీసుకున్నా పరిణామాలు తేడా కొట్టే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మరి ఇక్కడితో అయిపోద్దా.. లేక, ట్రిపుల్ ఆర్ మార్కు షాకులు బాబు & కో కు మరిన్ని ఉంటాయా అనేది ఆసక్తిగా మారింది.