అరెరే..ఏమైందీ భాగ్యనగరానికి? ఇరవై అయిదు నియోజకవర్గాలను ప్రభావితం చేసే హైద్రాబాద్ వంటి సువిశాలమైన నగరంలో కార్పొరేషన్ ఎన్నికల్లో ఉదయం నుంచి సాయంత్రం పోలింగ్ ముగిసేవరకు కేవలం ముప్ఫయి ఆరు శాతమా! ఎంత దారుణం!!
నగర ఓటర్లు అంటే ఎక్కువశాతం విద్యావంతులు, ఉద్యోగస్తులు, వ్యాపారాలు ఉంటారు. కాస్మోపాలిటన్ సిటీ అయిన హైదరాబాద్ లో ఇంత తక్కువ ఓటింగ్ జరగడం అంటే అత్యంత శోచనీయం. మొన్నటివరకు ప్రచారం అంటే ఎంత హంగామా చూసాము! అన్ని పార్టీల ప్రచారంలో లక్షలమంది ఉత్సాహంతో పాల్గొన్నారు. టీఆరెస్, బీజేపీ, మజ్లీస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు, ఊరేగింపులు చేశారు. కోవిద్ నిబంధనలను కూడా కాలరాసి కొట్టుకున్నారు. డబ్బులతో పట్టుపడ్డారు. ఓటర్లందరికి వ్యక్తిగతంగా ఫోన్లు కూడా చేసి బతిమాలారు. వీరి హంగామా చూసినవారికి కనీసం తొంభై శాతం అయినా పోలింగ్ జరుగుతుందని భావించారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై అయిదు శాతం ఓటింగ్ జరిగింది. మరి ఈసారి ఎందుకు అత్యంత తక్కువ ఓటింగ్ జరిగింది?
ఇంత తక్కువ ఓటింగ్ ఇస్తున్న సంకేతాలు ఏమిటి? పార్టీలు అంటే వైముఖ్యమా? అభ్యర్థులు నచ్చలేదా? పార్టీల ప్రచార తీరు పట్ల నిరసనా? బీజేపీ అగ్రనేతలు కూడా హైద్రాబాద్ ను చుట్టుముట్టారు. ప్రచారం చేశారు. మతం మత్తు చల్లారు. హెచ్చరించుకున్నారు. బెదిరించుకున్నారు. వారి తీరు ఓటర్లకు నచ్చలేదా? ఏదైనా తమ నిరసననో, అభిమానాన్నో ఓటు వేసి వ్యక్తం చెయ్యాలి కదా? అధికశాతం పోలింగ్ జరగకపోవడానికి విశ్లేషకులు అనేకరకాల కారణాలు చెబుతున్నారు. చాలామంది ఉద్యోగులు ఊళ్లకు వెళ్లిపోయారంటున్నారు. అయితే మాత్రం హైద్రాబాద్ ఖాళీ అయ్యేంత కాదు కదా?
ఒకటే కారణం కనిపిస్తున్నది. బద్ధకం. మనం ఒక్కళ్ళం వెయ్యకపోతే ఏమవుతుంది అనే ఉదాసీనత. ఓటు హక్కు వినియోగించుకోకపోయినా మనను కొట్టేవారు లేరు. తిట్టేవారు లేరు. ఇవాళ్టి ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఓటు హక్కు వినియోగించుకోని వారికి తప్పకుండా శిక్ష ఏదోకటి ఉండాలి అనిపిస్తుంది. ఆధార్ కార్డులు రద్దు చెయ్యడమో, వెయ్యో రెండు వేలో జరిమానా విధించడం, ప్రభుత్వ పథకాలకు అనర్హులను చెయ్యడమో…ఓటు వెయ్యని వారి ఇళ్లకు నీటి సరఫరా, కరెంట్ సరఫరా నిలిపెయ్యడమో…ఏదో ఒకటి పనిష్మెంట్ ఉండి తీరాలి. “ఓటు విలువైనది” అని నీతులు చెప్పడం కాదు. ఆచరణలో చూపించాలి.