Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ.. సునామీలా విరుచుకుపడుతున్న కోవిడ్ 19 వైరస్. జనం పిట్టల్లా రాలిపోతున్న వైనం.. స్మశానాలు ఖాళీ లేక, సామూహిక దహన సంస్కారాలు.. ఇలాంటి హెడ్ లైన్స్ చాలానే చూస్తున్నాం అను నిత్యం న్యూస్ ఛానళ్ళలో.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. హైకోర్టు సైతం, ఎన్నికల నిర్వహణపై అసహనం వ్యక్తం చేసింది, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మద్రాసు హైకోర్టు అయితే, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై హత్య కేసులు బనాయించాలని వ్యాఖ్యానించింది. పరిస్థితి ఇంత తీవ్రంగా వున్నా, ప్రజల్లో కరోనా వైరస్ పట్ల చైతన్యం అంతంతమాత్రమే. అసలు కరోనా భయం ఎవరికీ వున్నట్టు లేదు. న్యూస్ ఛానళ్ళు, పత్రికలు చూడకపోతే, అసలు కరోనా వున్నట్టే అనిపించడంలేదన్న భావన కొందరిలో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పలు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతోంది.
ఓటర్లు, పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. సోషల్ డిస్టెన్సింగ్ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంతలా అవగాహన కల్పించినా, పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం సోషల్ డిస్టెన్సింగ్ కనిపించలేదు. ఫేస్ మాస్కులు మాత్రం అందరూ ధరించారు. కానీ, ఏం లాభం.? ఫేస్ మాస్కుల్ని సరిగ్గా ధరించనివారే ఎక్కువమంది వున్నారు. ఎన్నికలనేవి ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనవి. ప్రతి ఓటరూ తన ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందే. కానీ, ఇది కరోనా కాలం. జనంపిట్టల్లా రాలిపోతున్న వైనం కళ్ళ ముందు కనిపిస్తున్న దరిమిలా, కరోనా నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేలా ఓటర్లను చైతన్యవంతుల్ని చేయాలి. ప్రభుత్వం తొలుత బాధ్యత తీసుకోవాలి. రాజకీయ పార్టీలూ బాధ్యతగా వ్యవహరించాలి. కానీ, ఇవేవీ కన్పించలేదు. ఎందుకంటే, ఇది భారతదేశం.. ఇక్కడ అంతా ఇలాగే వుంటుంది.