ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఇక జూన్ 4న వెలువడబోయే ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది. ఈ సమయంలో అనూహ్యంగా టీడీపీలో ఊహించని పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతూనే… ఈ సమయంలో పార్టీ తరుపున బలంగా పోరాడాలంటే లోకేష్ లాంటి యువ నాయకుడికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అంటున్నారు.
వాస్తవానికి పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరైనప్పటికీ బండి నడిచిపోతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీ అధ్యక్షుడు పెర్ఫార్మెన్స్ అనేది అత్యంత కీలకంగా మారుతుంది. మరి టీడీపీ నేత బుద్దా వెంకన్న మాత్రం.. ఈ సమయంలో లోకేష్ కే పార్టీ బాధ్యతలు అప్పగించాలని.. అది రిక్వస్ట్ కాదు, డిమాండ్ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్న పరిస్థితి.
దీంతో బుద్దా వెంకన్నది స్వామి భక్తా.. లేక, ముందు జాగ్రత్తా అనే చర్చ తెరపైకి వచ్చింది. సరే టిక్కెట్ దక్కని పరిస్థితుల్లో.. లోకేష్ ని ఇప్పటి నుంచే ప్రసన్నం చేసుకుంటే ఫ్యూచర్ లో ఇబ్బంది ఉండదని.. కోటరీలో మనిషిగా మారిపోవచ్చని బుద్దా వెంకన్న ఆలోచన అయితే అది వేరే విషయం.. ఆయన వ్యక్తిగత విషయం! ఈ క్రమంలో అక్కడితో ఆగని వెంకన్న… ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థావన తెచ్చి సంచలన వ్యాఖ్యలుచేశారు.
అవును… తాజాగా ఒక టీవీ ఇంటర్వూలో పాల్గొన్న వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ పై స్పందించారు. ఇందులో భాగంగా అసలు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏమిటి అని ప్రశ్నిస్తూనే.. సంబంధం లేదని చెప్పకనే చెప్పారు. పైగా ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ మొదలుపెట్టి… 2014, 19, 2024ల్లో టీడీపీ తరుపున ఎన్టీఆర్ ప్రచారం చేయలేదని చెప్పడం గమనార్హం.
దీంతో నెటిజన్లు బుద్దా వెంకన్నపై విరుచుకుపడుతున్నారు. పోలింగ్ కు ముందు కూడా ఇలాంటి కబుర్లు చెప్పాల్సింది అని ఒకరంటే… జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ వ్యూహాత్మకంగా దూరం చేసుకుందే తప్ప ఆయన ఏనాడూ పార్టీకి దూరంగా లేరని అంటున్నారు. పైగా.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ సభలకు హాజరైతే వారిని అవమానించి పంపారని గుర్తుచేస్తున్నారు.
ఆ విధంగా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం జూనియర్ ని వ్యూహాత్మకంగా పార్టీకి దూరం చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆరే కావాలని పార్టీకి, పార్టీ ప్రచారాలకూ దూరంగా ఉన్నారంటూ నిస్సిగ్గు వ్యాఖ్యలు, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారంటూ ఆయన ఫ్యాన్స్ ఫైరవుతున్నారని తెలుస్తుంది. ఇకపై టీడీపీకి జూనియర్ ఫ్యాన్స్ నుంచి మోరల్ సపోర్ట్ కూడా ఉండదని అంటున్నారు.