గత కొంతకాలంగానే బీజేపీ కీలక నేత పురంధేశ్వరిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి. అదీ, సోషల్ మీడియా వేదికగా.! ఎందుకు.? అంటే, టీడీపీ అధినేత చంద్రబాబుకి అనుకూలంగా పురంధేశ్వరి వ్యవహరిస్తున్నందుకే.!
బీజేపీ నేత పురంధేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరిస్తే, వైసీపీ నేత విజయసాయిరెడ్డికి మధ్యలో వచ్చిన ఇబ్బందేంటి.? తెరవెనుకాల ఏదో జరుగుతోంది. తనకు వ్యతిరేకంగా పురంధేశ్వరి ఏదో చేయబోతున్నారన్న అనుమానం విజయసాయిరెడ్డికి ముందే కలిగినట్టుంది. అదీ అసలు సంగతి.
ప్రస్తుతం బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా వున్నారు పురంధీశ్వరి. తాజాగా ఆమె ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖ రాశారు, విజయసాయిరెడ్డి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ. విజయసాయిరెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు.
వైఎస్ జగన్ అలాగే విజయసాయిరెడ్డి.. ఇద్దరూ కండిషన్ బెయిల్ మీదనే బయట వున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. బెయిల్ వచ్చినప్పటి కంటే, ఇప్పుడు ‘పవర్’ పరంగా ప్రభావితం చేసే స్థాయిలో వున్నారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో పురంధేశ్వరి పేర్కొనడం గమనార్హం.
అంటే, బెయిల్ రద్దు చేయాలనా.? ఏమోగానీ, మద్యం కుంభకోణానికి సంబంధించి, గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ సర్కారు మీద పురంధీశ్వరి. తమ దగ్గర వున్న సమాచారాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలోనూ ప్రస్తావించారామె.
ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియవా.? పురంధేశ్వరి లేఖ రాస్తే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వెంటనే స్పందించేస్తారా.? పురంధీశ్వరిది వృధా ప్రయాస తప్ప, కేంద్రానికి సఖ్యతగా వుంటోన్న విజయసాయిరెడ్డి విషయంలో, ఆమె కోరుకుంటున్న రీతిలో చర్యలు చోటు చేసుకునే అవకాశమే లేదు.