కాక రేపిన దుబ్బాక ఉపఎన్నిక 

strong competition to trs in dubbaka by election
నిజం చెప్పుకోవాలంటే దుబ్బాక నియోజకవర్గం ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి  ప్రాతినిధ్యం వహిస్తున్నది కాదు.  ఒక మెదక్, సిరిసిల్ల, గజ్వేల్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్  లాంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గం కాదు. అధికారపార్టీ శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఊహించని మరణంతో అక్కడ ఉప్పఎన్నిక అనివార్యం అయింది.  అక్కడ అధికారపార్టీ సునాయాసంగా గెలవడానికి సవాలక్ష కారణాలు చెప్పచ్చు.  కేసీఆర్ మీద రాష్ట్రంలో వ్యతిరేకత లేదు. కరోనా పరిస్థితులను కూడా కేసీఆర్ సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని మంచిపేరు ఉంది. అలా అని కాంగ్రెస్, బీజేపీ పుంజుకున్న దాఖలా లేదు. కానీ విచిత్రంగా దుబ్బాకలో హోరాహోరీ  అన్నట్లు దాదాపు ఇరవై రోజులపాటు పెద్ద యుద్ధమే జరిగింది.  
 
గత లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ నాలుగు సీట్లు, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకున్నాయి.  అయినంతమాత్రాన ఆ తరువాత ఆ పార్టీలు అన్ని ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడిపోయాయి.  హుజూర్ నగర్ ఉప ఎన్నికలో డిపాజిట్లు కూడా దక్కలేదు బీజేపీకి.  మునిసిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తెరాసయే జయకేతనం ఎగురవేసింది.  కాబట్టి ఏ రకంగా చూసినా దుబ్బాక ఉపఎన్నిక తెరాస అసలు పట్టించుకోవాల్సిన విషయమే కాదు.  అక్కడ సానుభూతి ఓటింగ్ తెరాసకు అదనపు బలాన్ని ఇస్తుంది.  అయితే సోషల్ మీడియాలో జరిగిన ప్రచార యుద్ధం, పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడం, హోటళ్లలో దూరి కొట్టుకోవడం, సవాళ్లు, ప్రతిసవాళ్ళతో తెలంగాణ మొత్తం హోరెత్తిపోయింది.  నంద్యాల ఉపఎన్నికలో ఎంత హడావిడి జరిగిందో దుబ్బాకలో కూడా అంతకన్నా ఎక్కువగా రాద్ధాంతం జరిగింది.  

strong competition to trs in dubbaka by election

ఈ ఉపఎన్నిక భారాన్ని తెరాస ట్రబుల్ షూటర్ గా పిలువబడే ఆర్ధికమంత్రి హరీష్ రావు భుజస్కంధాల మీద మోపారు కేసీఆర్.  ఆయన మాత్రం ఉపఎన్నికలో ప్రచారం చెయ్యలేదు.  ఇది కచ్చితంగా మంచి సంప్రదాయం అని చెప్పాలి.  మూడు దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రి స్థాయివారు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారు కారు.  ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు గుర్తు లేదు. చంద్రబాబు నాయుడు వచ్చాకే ఉపఎన్నికలలో కూడా వందలకోట్లు ఖర్చు చేయడం, ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం లాంటి దుష్టసంప్రదాయాలు మొదలయ్యాయి.  దుబ్బాకలో జరిగిన ప్రచారం కన్నా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని చూస్తే టీఆరెస్ కు అసలు డిపాజిట్ అయినా దక్కుతుందా అన్నంత తీవ్రంగా జరిగింది. 
 
బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విన్యాసాలు ప్రజల దృష్టిలో జుగుప్సాకరంగా పరిణమించాయి.  ఆయన నిరాహారదీక్ష చేయడం, ఒక కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడి వారం రోజులు మృత్యువుతో పోరాడి మరణించడం అత్యంత బాధాకరం.  రాజకీయనాయకుల డ్రామాలకు అమాయకులు బలైపోవడం విచారకరం. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యక్తిగా మంచి ప్రతిష్ట కలిగినవారే.  రాష్ట్రం మొత్తం పరిచయం ఉన్న నాయకుడు.  అయితే ఆయన కేసీఆర్ కు బద్ధ విరోధి. అయన పోటీ చెయ్యడం వల్లనే అన్ని పార్టీలు  ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే రెండు మూడుసార్లు రఘునందన్ రావు డబ్బు కట్టలతో పోలీసులకు పట్టుబడటం ఆయన ప్రతిష్టను మంటగలిపింది. అలాగే బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొట్టాలని కూడా ప్రయత్నం చేసింది. ప్రభుత్వం దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నది. అలాగే ఎన్నికల చివరి రోజున చివరి గంటలో హరీష్ రావు ప్రయోగించిన అస్త్రం బీజేపీని నిరుత్తరులను చేసింది. రఘునందన్ రావు తండ్రికి సైతం ప్రభుత్వం నుంచి పింఛన్, రేషన్ అందుతున్నదని హరీష్ రావు వేసిన బాణం తిరుగులేనిది. దానికి సమాధానం చెప్పే వ్యవధి కూడా లేకుండానే ఎన్నికల ప్రచారానికి తెరపడింది. హరీష్ రావు యుక్తి, బుర్ర అవసరమైన సమయాల్లో పాదరసంలాగా  ఎంత వేగంగా పనిచేస్తాయో ఈ ఎన్నికల ప్రచారంలో లోకానికి తెలిసింది.  
 
ప్రచారం చివరికి వచ్చేసరికి కాంగ్రెస్ వెనుకబడినట్లు కనిపించింది. బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ పోలీసులతో అహంకారపూరితంగా మాటలాడిన వీడియోలు, బండి సంజయ్ ప్రవర్తన బీజేపీ పట్ల పలుచన భావం కలిగించాయి. ఈ ఎన్నికలో తెరాస గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా, బీజేపీ గెలిచినా పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. సాధారణంగా ఉపఎన్నికలో అధికారపార్టీ వైపు మొగ్గు ఉంటుంది. దానికితోడు దివంగత ఎమ్మెల్యే భార్య పోటీలో ఉండటం మరికొంత కలిసొస్తుంది.  టీఆరెస్ గెలవడం లాంఛనమే. ఒకవేళ ఓడిపోతే మాత్రం రాష్ట్రంలో ఊహించని పరిణామాలు సంభవిస్తాయి.   
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు