Political Panchangams : ఇవేం రాజకీయ పంచాంగాలు మహాప్రభో.!

Political Panchangams

Political Panchangams :  ఓ పంచాంగమేమో వైసీపీకి తిరిగి అధికారం వస్తుందని చెబుతోంది. ఇంకో పంచాంగమేమో టీడీపీకి అనుకూల పరిస్థితులు వస్తున్నాయని చెబుతోంది. మరో పంచాంగం బీజేపీకి అనుకూలంగా.. ఇదీ వరస.!

గత కొంతకాలంగా రాజకీయ పంచాంగాలు హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తున్నాయన్నది నిర్వివాదాంశం. పంచాంగం చెప్పేటోళ్ళు డబ్బుకో, రాజకీయానికో, అధికారానికో అమ్ముడుపోతున్నారు. ఈ కారణంగానే పంచాంగాలు కాస్తా రాజకీయ పంచాంగాలుగా తయారయ్యాయి.

పంచాంగాలు చెప్పేవారు కూడా, ఆయా రాజకీయ పార్టీలకు అధికార ప్రతినిథుల్లానో, ఆయా పార్టీలకు ప్రకటన కర్తలుగానో మారిపోతున్నారు తప్ప, శాస్త్రాన్ని వున్నది వున్నట్లుగా చెప్పడంలేదు.

‘అదిగో పంచాంగంలో బీజేపీకి మంచి రోజులని వుంది.. మేం ఖచ్చితంగా సత్తా చాటుతాం..’ అంటూ ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ‘కాషాయ’ పంచాంగాన్ని పట్టుకుని నానా హంగామా చేసేస్తున్నారు. పంచాంగాల్లోనూ టీడీపీ గాలి పోయింది.. ఇక టీడీపీ కోలుకోవడం కష్టమంటూ వైసీపీ నేతలు హడావిడి షురూ చేశారు.

అబ్బే, మా పంచాంగంలో మాకే అనుకూల ఫలితాలున్నాయంటారు టీడీపీ నేతలు. ఎవరికి వారు సొంతం పంచాంగాలు రాయించేసుకుని జబ్బలు చరిచేసుకుంటే ఎలా.? కరోనా పాండమిక్ వస్తుందని ఏ పంచాంగమైనా చెప్పిందా.? లేదే.!

ఏ పంచాంగమైనా ప్రజల బతుకులు బాగుపడతాయా.? లేదా.? అని చెబితే బావుంటుంది. అంతే తప్ప, పార్టీల బాగోగుల గురించి పంచాంగ శ్రవణాలు వినిపించేవారు పాకులాడితే, శాస్త్రం వాళ్ళని క్షమించదుగాక క్షమించదు. హిందూ ధర్మానికి ఇప్పటికే మకిలి పట్టిపోయింది ఇలాంటి పండితులవల్ల. అది మరింత ముదిరి పాకాన పడుతోందిప్పుడు.