ప్రముఖ సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సీ.హెచ్.వీ.ఎం. కృష్ణారావు (64) ఇకలేరు. గతేడాది కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. జర్నలిజం రంగంలో ఆయన 47 ఏళ్ల పాటు విశేషమైన సేవలందించారు. తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో ఉన్నత హోదాల్లో పనిచేశారు.
అవును… రాజకీయ విశ్లేషకుడిగా నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరున్న ప్రముఖ జర్నలిస్ట్ కృష్ణారావు కన్నుమూశారు. సాధారణంగా జర్నలిస్ట్ లకు, కొంతమంది రాజకీయ నాయ్యకులకూ “బాబాయ్”గా సుపరిచితులు అయిన ఆయన.. పత్రికారంగంలో తనదైన రీతిలో చెరగని ముద్ర వేసుకున్నారు.
1975లో ఒక స్ట్రింగర్ గా తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన… తన ప్రతిభతో అతి తక్కువ కాలంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ సహా పలు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో పనిచేశారుల్. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇందులో మరిముఖ్యంగా డెక్కన్ క్రానికల్ (డీసీ)లో న్యూస్ బ్యూరో చీఫ్ గా సుదీర్ఘకాలం ప్రయాణం సాగించిన ఆయన… అక్కడ 18 సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించి అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషించారు. అనేక టివీ డిబేట్లలో తనదైన వెర్షన్ వినిపించేవారు. అత్యద్భుతమైన విశ్లేషణను అత్యంత సున్నితంగా వివరించడంలో ఆయన దిట్ట!
గతేడాది క్యాన్సర్ బారిన పడిన కృష్ణారావు.. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా సేవలు అందించిన కృష్ణారావు మృతికి పలు మీడియా సంఘాలు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.