Rowdy Boys Review : ‘రౌడీ బాయ్స్’ రివ్యూ – రాంగ్ వార్!

రేటింగ్ : 2.5/5

రచన -దర్శకత్వం : శ్రీ హర్ష కొనుగంటి

నటీనటులు: ఆశిష్ రెడ్డి, అనుపమా పరమేశ్వరన్, సహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్,

ఛాయాగ్రహణం: మదీ

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియెషన్స్,

నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్

Rowdy Boys Review : అగ్రనిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశీష్ రెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన ‘రౌడీ బాయ్స్’ సంక్రాంతి సినిమాల సందడిలో ఒకటిగా విడుదలైంది. నాగ్ – చైతూ ల ‘బంగార్రాజు’, కృష్ణ మనవడు అశోక్ గల్లా ‘హీరో’, చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చీ’ మూడూ ఇతర సంక్రాంతి సందడి సినిమాలు. టాలీవుడ్ బిగ్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ముందుకొచ్చి ‘రౌడీ బాయ్స్’ ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేశారు, రికమెండ్ చేశారు, మంచి ఎంటర్ టైనర్ గా ప్రామీస్ చేశారు. అత్యధిక థియేటర్లలో అట్టహాసంగా విడుదలైంది. ఆశీష్ రెడ్డికి ప్రత్యర్థిగా నిర్మాత లగడపాటి శ్రీధర్ కొడుకు సహిదేవ్ విక్రమ్ కూడా ఈ మూవీతో పరిచయమయ్యాడు. గ్లామర్ ఒలకబోయడానికి హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ జాయినైంది. దేవీశ్రీ ప్రసాద్ తొమ్మిది పాటలూ మోసుకుంటూ వచ్చి సినిమా స్పేస్ ని తన స్వరాలతో ఆక్రమించేశాడు. 2018 లో ‘హుషారు’ అనే స్లీపర్ హిట్ తీసి మంచి క్రియేటివిటీ గల మేకర్ అన్పించుకున్న హర్ష కొనుగంటి – హైఫైగా ఈ ఇన్స్టాగ్రామ్ జనరేషన్ కాలేజ్ రోమాన్స్ – యాక్షన్ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. మరి ఆకర్షణీయమైన ఇన్ని హంగులతో ఇది ఇన్స్టాగ్రామ్ జనరేషన్ ‘ప్రేమదేశం’ అయ్యిందా? తెలుసుకుందాం.

కథ

ఇంట్లో ఎవరి మాటా వినని అక్షయ్ (ఆశీష్ రెడ్డి) రాక్ స్టార్ గా మారాలనుకుంటాడు. ఇంట్లో తిట్లు పడలేక ఇంజనీరింగ్ కాలేజీలో చేరతాడు. ఆ కాలేజీకి ఎదురుగా మెడికల్ కాలేజీ వుంటుంది. మెడికల్ కాలేజీలో చేరుతుంది కావ్య (అనుపమా పరమేశ్వరన్). చూడగానే రెండేళ్ళు పెద్దదైన ఆమెని ప్రేమిస్తాడు అక్షయ్. ఈ రెండు కాలేజీల స్టూడెంట్స్ మధ్య చిన్న చిన్నవిషయాలకి గ్యాంగ్ వార్స్ జరుగుతూంటాయి. మెడికల్ కాలేజీ స్టూడెంట్ లీడర్ విక్రమ్ (సహిదేవ్ విక్రమ్) కావ్యాని ప్రేమిస్తూంటాడు. కావ్యాని అక్షయ్ ప్రేమించడం చూసి అతడి మీద దాడులు ప్రారంభిస్తాడు. కావ్యా గురించి రెండు కాలేజీల మధ్య గ్యాంగ్ వార్స్ లో తీవ్రంగా గాయపడ్డ అక్షయ్ తో, లీవ్ ఇన్ రిలేషన్ షిప్ కి సిద్ధపడుతుంది కావ్య. దీని తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది ఈ కాలపు ‘ప్రేమ దేశం’ కాదు, ‘ప్రేమసాగరం’ కాదు. ముక్కోణ ప్రేమ కథ లివ్ ఇన్ రిలేషన్ షిప్ తో చూపించారు. కాలేజీ గ్యాంగ్ వార్స్, లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనే రెండు అంశాల వల్ల కథ కొత్తగా మారిందేమీ లేదు. ‘జార్జి రెడ్డి’ మూవీలో లాగా కాలేజీ గ్యాంగ్ వార్స్ లో విషయం లేదు. పైగా సిల్లీగా వున్నాయి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లోనూ విషయం లేదు. ఫస్టాఫ్ గ్యాంగ్ వార్స్, సెకండాఫ్ లివ్ ఇన్ రిలేషన్ షిప్ గా కథని రెండుగా విభజించి చూపించారు. కానీ గ్యాంగ్ వార్స్ ప్రభావం లివ్ ఇన్ రిలేషన్ షిప్ పైనో, లేదా లివ్ ఇన్ రిలేషన్ షిప్ ప్రభావం గ్యాంగ్ వార్స్ పైనో వుండేట్టు రెండు అంశాల్నీ కలిపెయ్యక రెండు ముక్కలుగా చూపించి సరిపెట్టేశారు. కాలేజీల మద్య గ్యాంగ్ వార్స్ కాదు, రెండు కాలేజీలూ కలిసిపోయి చేసే ‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’ అవసరమని చెప్పేట్టుగా కొత్త రాడికల్ కథని సృష్టించ లేకపోయారు. బహుశా కాలేజీల మధ్య లివ్ ఇన్ రిలేషన్ షిప్, యువతీ యువకుల లివ్ ఇన్ రిలేషన్ షిప్ సంస్కృతి నుంచి దృష్టిని మళ్ళించే విప్లవాత్మక అంశమవుతుందేమో… క్రేజీ థాట్స్ రాకపోతే ఇన్స్టాగ్రామ్ జనరేషన్ వైరల్ సినిమాలు తీయలేరు.

నటనలు- సాంకేతికాలు

ఆశీష్ రెడ్డి పరిచయ సినిమా కేవలం అతడి డాన్సింగ్, యాక్షన్ స్కిల్స్ కోసం తీసినట్టుంది. నటనలో ‘హృదయం’ లేదు. డాన్స్ అండ్ యాక్షన్ తో మాత్రం గొప్ప మ్యూజికల్ యాక్షన్ హీరో అవుతాడు. హీరోయిన్ తో రోమాంటిక్ సీన్లలో కూడా నటనని ఇంప్రూవ్ చేసుకోవాల్సి వుంది. రోమాంటిక్ సీన్లు స్క్రిప్టులోనే నిర్జీవంగా వున్నాయన్నది వేరే విషయం. కానీ ఆశీష్ క్యారక్టర్ రఫన్నీ రోమాంటిక్ యాక్షన్ హీరోగా వుండుంటే ఎంటర్ టైన్మెంట్ వుండేది. యాక్షన్లో కామెడీని మిక్స్ చేసినప్పుడే క్యారక్టర్ కలర్ఫుల్ గా వుంటుంది. ఇంటి దగ్గర పేరెంట్స్ తో చేసేది ఉత్త డైలాగ్ కామెడీయే. ఆవారా కొడుకు ఇంట్లో పేరెంట్స్ తో చేసే రొటీన్ డైలాగ్ కామెడీ.

హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ చాలా గ్లామరస్ గా, క్లాస్ గా వుంది మెడికోగా. ‘ప్రేమ దేశం’ లో టబూ అంత గ్రేస్ తో మాత్రం కాదు. ఇక ఆమె పాత్రలో మాత్రం రెగ్యులర్ ఫార్ములా లవర్ తప్ప, కొత్తగా కట్టిపడేసే, కదిలించే ఫీలింగులు లేవు. ప్రతినాయకుడుగా సహిదేవ్ విక్రమ్ బావున్నాడు. విషయముంది. సరైన విధంగా వినియోగించుకుంటే నాలుగు కాలాల పాటు అమ్మాయిల గుండెల్లో గుబులు రేకెత్తిస్తాడు. ఇదే స్వాంకీ గెటప్ తో కొనసాగితే.

దర్శకుడి కథ కన్నా చాలా చాలా భారం దేవీశ్రీ ప్రసాద్ మీదేసుకుని తొమ్మిది పాటలూ పళ్ళెంలో పెట్టి ఇచ్చాడు. మ్యూజికల్ గా ఈ సినిమా కూర్చోబెడితే మంచిదే. ‘ప్రేమసాగరం’, ప్రేమ దేశం’ లలో విషయం క్రేజ్ సృష్టించి మ్యూజికల్ గా హిట్టయ్యాయి.

‘హుషారు’ తో ‘విషయం’ కనబర్చిన దర్శకుడు హర్ష ఈ రెండో సినిమా దర్శకత్వంతో చాలా మెట్లు కిందికి దిగిపోయాడు. స్క్రిప్టు, దాంతో దర్శకత్వం చాలా తీసికట్టుగా వున్నాయి. ఓపెనింగ్ సీను ఒక మెడికల్ కాలేజీ అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజీ ముందు నిలబడి వుంటే టీజ్ చేస్తారు ఇంజనీరింగ్ స్టూడెంట్లు. ఆమె పరుగెట్టుకుని ఎదురుగా మెడికల్ కాలేజీలోకి వెళ్ళిపోయి స్టూడెంట్స్ కి చెప్తుంది. ఆమె ఇంజనీరింగ్ కాలేజీ ముందునుంచి పరుగెత్తుతున్నప్పప్పుడు పగలు. ఎదురుగా వున్న మెడికల్ కాలేజీలోకి దూరే సరికి రాత్రి. ఇదెలా సాధ్యం? పగలు పరిగెట్టడం మొదలెట్టి రాత్రికి చేరుకుందా ఎదురుగా తన కాలేజీకి? లేకపోతే దర్శకుడేమైనా సింబాలిక్ గా చెప్తున్నాడా? ఫస్టాఫ్ కథ పగటి పూటలా క్లియర్ గా వుంటుందనీ, సెకండాఫ్ కథ అంధకారంలో దారి తెలియక గందరగోళంగా వుంటుందనీ క్లూ ఇస్తున్నాడా?

—సికిందర్