మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ అధికారులు పెట్టిన ప్రెస్ మీట్లపై “పక్క రాష్ట్రంలో ప్రెస్ మీట్ లు ఎలా పెడతారు” అంటూ టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం ఈనాడు పేపర్ మొత్తం ఇలాంటి స్టేట్ మెంట్లతోనే నిండిపోయింది. విషయం కోర్టులో ఉండగా.. సీఐడీ అత్యుత్సాహం ఏమిటి అనే స్థాయిలో టీడీపీ నేతలు లాపాయింట్లు లాగారు. ఆ సంగతి అలా ఉంటే… ఈసారి విచరణకు సొంత రాష్ట్రానికే రావాలని ఏపీ సీఐడీ అధికారులు రామోజీకి నోటీసులు జారీచేశారు.
అవును… మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నిందితులుగా ఉన్న చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్ లు విచారణకు రావాలంటూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. జూలై5వ తేదీన గుంటూరులోని సీఐడీ రీజనల్ ఆఫీస్ కి హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసులో ఏ-1గా రామోజీరావు ఉండగా, ఏ-2గా శైలజా కిరణ్ లు ఉన్నారు. 41ఏ కింద వారికి నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ.
వయసుకు మర్యాద ఇచ్చి ఇంటికెళ్లి విచారిస్తుంటే… విచారణకు సహకరించడం లేదని, పైగా వాళ్లను ఎవరు విచారించాలో కూడా వారే నిర్ణయిస్తున్నారని… అధికారులను ఇంటివద్ద గేట్ల ముందు నిలబెడుతున్నారని ఇప్పటికే సీఐడీ అధికారులు తెలిపారు! దీంతో… ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నారో ఏమో కానీ… గుంటూరు రావాల్సిందేనని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు.
కాగా, మార్గదర్శి చిట్ ఫండ్స్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఆ సంస్థకి చెందిన రూ. 1,035 కోట్ల రూపాయల ఆస్తులను రెండు దశల్లో సీఐడీ సీజ్ చేసింది. ఇదే సమయంలో మార్గదర్శి నిర్వహిస్తున్న 23 చిట్ గ్రూప్ లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే.