వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ‘వాయిస్’ పరంగా బలమైన నాయకుల్లో ఆయనా ఒకరు. మంత్రిగా వున్న సమయంలో, మంత్రివర్గ నిర్ణయాల గురించి స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగేవారాయన. తన శాఖ వ్యవహారాల సంగతెలా వున్నా, రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేయడంలో అప్పటి మంత్రుల్లో పేర్ని నాని తర్వాతే ఎవరైనా.
మంత్రి పదవికి సంబంధించి ‘కొనసాగింపు’ లభించలేదు పేర్ని నానికి. అయినాగానీ, తన వాయిస్‌ని పార్టీ తరఫున బలంగా వినిపించడంలో పేర్ని నాని తన ప్రత్యేకతను చాటుకుంటూనే వచ్చారు. అలాంటి పేర్ని నాని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించేశారు.
అంతే కాదు, మళ్ళీ ఇంకో మీటింగులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి కనిపించే అవకాశం వస్తుందో లేదో తెలియదంటూ పేర్ని నాని వ్యాఖ్యానించడంతో అంతా విస్తుపోయారు. ‘నా కొడుకు పేర్ని కిట్టు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాడు..’ అని మాత్రం పేర్ని నాని చెప్పడం గమనార్హం.
‘నాకు టిక్కెట్ వద్దు.. నా కొడుక్కి టిక్కెట్టు ఇవ్వండి..’ అంటూ పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పేర్ని నాని ఇటీవలి కాలంలో తరచూ బతిమాలుకుంటూ వస్తున్నారు. ఒకవేళ వైఎస్ జగన్ గనుక, పేర్ని కిట్టుకి అవకాశం ఇవ్వకపోతే, పేర్ని నాని తన కొడుకుతో కలిసి పార్టీ మారబోతున్నారా.?
ఇంకో మీటింగులో ఇలా కలిసే అవకాశం వస్తుందో రాదో.. అని పేర్ని నాని వ్యాఖ్యానించడం.. అదీ ముఖ్యమంత్రి సమక్షంలోనే చెప్పడం.. పలు అనుమానాలకు తావిస్తోంది.