ముందస్తు ఎన్నికలపై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు… పవన్ పై కామెంట్స్ వైరల్!

గత కొన్ని రోజులుగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై తెగ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక జగన్ హస్తిన పర్యటన అనంతరం ఈ చర్చ మరింత జోరందుకుంది. ఇదే సమయంలో ఈ నెల 7న జ‌గ‌న్ కేబినెట్ భేటీ అవుతున్న నేప‌థ్యంలో ఈ విషయంపై ఆల్ మోస్ట్ కన్ ఫర్మేషన్ కి వచ్చేస్తున్నారు మిగిలిన రాజకీయ పార్టీల నేతలు. ఇదే విషయాన్ని చంద్రబాబు గత కొన్ని రోజులుగా మైకులముందు ఊదరగొడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాలపై స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఈ నెల 7న జ‌గ‌న్ కేబినెట్ భేటీ అవుతున్న నేప‌థ్యంలో ముంద‌స్తు ఎన్నిక‌ల అంశం తెర‌పైకి వ‌చ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు జ‌గ‌న్ కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం వుంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. అందులో భాగంగా… అక్టోబ‌ర్‌ లో అసెంబ్లీని ర‌ద్దు చేస్తార‌ని కూడా చెబుతున్నారు. ఈ సమయంలో ముందస్తు వార్తలపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వైసీపీకి లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన… 2019 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని.. వారు కట్టబెట్టిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలు ఒకేసారి వస్తాయని పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. దీంతో… ముందస్తుపై ఒక క్లారిటీ వచ్చిందని, కన్ ఫాం చేసేసుకోవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆ సంగతి అలా ఉంటే… ఈ సందర్భంగా పొత్తులపై స్పందించారు పెద్దిరెడ్డి. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై కూడా పెద్దిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు రాజకీయ వైకల్యంతో బాధపడుతున్నారని, అందుకే ఇతరుల సాయం కోసం ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేసిన పెద్దిరెడ్డి… చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని, అందువల్లే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. ఇక కర్ణాటక మేనిఫెస్టోను, వైసీపీ మేనిఫెస్టోను కాపీకొట్టి తయారుచేసిన వదిలిన టీడీపీ తొలివిడత మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించరని పెద్దిరెడ్డి కామెంట్ చేశారు.

ఇదే సమయంలో పవన్ ప్రస్థావనపై పెద్దిరెడ్డి లైట్ తీసుకున్నారు. పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడటానికి ఏముందని మాట్లాడతాం అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్ క్లూజన్ ఇచ్చారు! దీంతో… ప‌వ‌న్‌ క‌ల్యాణ్ గురించి మాట్లాడి త‌న స్థాయిని దిగ‌జార్చుకోలేన‌ని పెద్దిరెడ్డి ప‌రోక్షంగా చెప్పిన‌ట్టైందనే కామెంట్లు వైరల్ అవుతున్నాయి!