జనసేనాని పవన్ కల్యాణ్ గడిచిన రెండు రోజులు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఏప్రిల్ 3న ఢిల్లీలో కేంద్ర మంత్రి. బీజేపీ వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లతో పవన్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో బీజేపీ ఏపీ ఇంచార్జి మురళీధరన్ తో రెండుసార్లు పవన్ సమావేశం అయ్యారు. ఈ భేటీల్లో జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
ఈ సమయంలో ప్రశ్నించిన మీడియాకు… చెప్తా.. చెప్తా.. అన్నీ చెప్తా.. అందరినీ కలిసిన తరువాత అన్ని విషయాలను చెప్తానన్నారు పవన్! దీంతో… జనసైనికులు ఏవేవో ఊహించుకున్నారు.. కచ్చితంగా కొత్త విషయం అయితే చెప్తారని భావించారు. కానీ… పాడిందే పాడరా పాచిపళ్ల దాసన్న సామెతను గుర్తుచేశారు.
అవును… పవన్ కల్యాణ్ సడన్ గా ఢిల్లీ టూర్ పెట్టుకోవడం, రెండు రోజుల పాటు బీజేపీ పెద్దలను వరుసపెట్టి కలవడంతో ఏపీ రాజకీయాల్లో ఏదో కీలక పరిణామం జరగబోతోందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ (జరగ) లేదు. ఆఖరికి బీజేపీ – జనసేన పొత్తుపై కూడా క్లారిటీ (రా) లేదు. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయమని కూడా పవన్ చెప్పలేదు. ఢిల్లీ టూర్ తర్వాత జనసైనికులను మరింత “మకతిక” పెట్టిన జనసేనాని… “ఏపీకి మంచిరోజులొస్తాయి” అని మాత్రమే చెప్పారు. కానీ… దానర్ధం మాత్రం క్లియర్ గా చెప్పలేదు!
ఇవి కాకుండా… పవన్ ఇంకా ఏమి మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. “వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది జనసేన అజెండా, భారతీయ జనతా పార్టీది కూడా అదే అజెండా”… అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి అన్ని కోణాల నుంచి బీజేపీ పెద్దలతో కూర్చుని లోతుగా చర్చించామని చెప్పుకొచ్చారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… “రెండు రోజుల ఢిల్లీ పర్యటన చాలా బలమైన సత్ఫలితాలను ఇస్తుందనే నమ్ముకం ఉంది” అని తెలిపిన పవన్… ఆ “బలమైన సత్ఫలితాలు” ఏమిటి అనేది మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో… “2014 పొత్తులు రిపీట్ అయితే వాటిని బలమైన సత్ఫలితాలు అంటారు” అని క్లారిటీ ఇస్తున్నారు నెటిజన్లు!
మంగళవారం రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు. దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాటు బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జి, కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్… “ఏపీకి సంబంధించి స్థిరత్వం ఉండాలని మొదటి నుంచి కోరుకుంటున్నామన్నారు. వైసీపీ నాయకుల అవినీతి, అరాచకాలపై చర్చించాం. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తాం. పొత్తుల గురించి సమావేశంలో చర్చకు రాలేదు.. రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం అవ్వాలి, అధికారం ఎలా సాధించాలి అనే అంశాలపై మాత్రమే చర్చించాం” అన్నారు.
ఇక్కడ మరో భారీ ప్రశ్న వేసుకుంటున్న జనసైనికులు… “అసలు రెండు పార్టీలూ పొత్తు పెట్టుకోనప్పుడు – వీరిమధ్య పొత్తు టాపిక్ రానప్పుడు… ఒకే రాష్ట్రంలో రెండు వేరు వేరు పార్టీలు ఎలా బలోపేతం అవ్వాలో, అధికారం ఎలా సాధించాలో కలిసి చర్చించడం ఏమిటి? పొత్తు లేనప్పుడు ఇలాంటి చర్చలు ఎవరైనా చేస్తారా? అయితే పొత్తైనా ఉండి ఉండాలి.. లేదా, ఏదో చెప్పలేక పవన్ ఇలాంటి అసత్యాలు చెప్పారని భావించాలి” అంటూ నిట్టూరుస్తున్నారు. ఫలితంగా… ఢిలీ యాత్ర ఫుణ్యమాని మరింత అస్పష్టతకు పవన్ తెరతీశారన్నమాట!