గతకొన్ని రోజులుగా ఏపీలో ఉమన్ ట్రాఫికింగ్ అంటూ పవన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అదృశ్యానికి, ట్రాఫికింగ్ కి తేడా తెలియని అజ్ఞానంతో పవన్ కొట్టుమిట్టాడుతున్నారని తాజాగా కేంద్రం విడుదల చేసిన ఘణాంకాలతో నిరూపితమైందని అంటున్నారు వాలంటీర్లు!
అవును… గ్రామాల్లో ఉండే ఒంటరి మహిళలు, అమ్మాయిల వ్యక్తిగత వివరాలను సేకరించి వారిని వ్యభిచార గృహాలకు తరలిస్తున్న ముఠాకు వాలటీర్లే మెయిన్ లీడ్ అనే స్థాయిలో పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవాలు ఏమిటో గణాంకాల సహితంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా… తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో అమ్మాయిలు, మహిళలు అదృశ్యం అవుతున్న సంగతిని కేంద్రం ప్రకటించింది.
ఈ లెక్కల ప్రకారం… రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి గత మూడేళ్లలో 72 వేల 767 మంది అదృశ్యం అయినట్టు పార్లమెంటుకు నివేదించింది. వీరిలో సుమారు 16 వేల మంది అమ్మాయిలు ఉండగా 56 వేల పైచిలుకు మహిళలు ఉన్నారని తెలిపింది. ఈ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని కూడా వెల్లడించింది.
రాష్ట్రాల వారీగా చూస్తే… గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 30 వేల మంది అదృశ్యం అవ్వగా… తెలంగాణ రాష్ట్రంలో 43 వేల మంది అదృశ్యం అయినట్లుగా కేంద్రం ప్రకటించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో… పవన్ పై వురుచుకుపడుతున్నారు ఏపీ వాసులు, నెటిజన్లు, వాలంటీర్లు!
ఏపీలో మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్లే కారకులని.. ఒక మంచి వ్యవస్థ మీద పనికిమాలిన ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్.. అంతకంటే ఎక్కువగా తెలంగాణలో జరుగుతున్న అదృశ్యాలకు ఎలాంటి సంజాయిషీ ఇస్తారు? అని ప్రశ్నిస్తున్నారు ఏపీ వాలంటీర్లు.
ఇదే సమయంలో ఏపీలో మహిళలు అదృశ్యం వాలంటీర్ల వల్ల జరుగుతుందని భావిస్తుంటే… తెలంగాణలో ఎందుకు జరుగుతుందో చెప్పగలారా.. కనీసం ప్రశ్నించగలరా.. ఒక్క ట్వీట్ అయినా చేయగలరా.. అంత ధైర్యం ఉందా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అంటే అంత వణుకా అని అడుగుతున్నారు.
ఇదే సమయంలో ఏపీలో రాబోయేది ఎన్ డీయే ప్రభుత్వం అని.. మోడీ – అమిత్ షా లతో తనది రాజకీయాలతో సంబంధం లేని మహా గొప్ప అనుబంధం అని చెప్పుకుంటున్న పవన్… బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ మహిళల అదృశ్యం కేసుల విషయంలో టాప్ ప్లేస్ లో ఉండటానికి గల కారణం ఏమిటో వివరించగలరా అని అడుగుతున్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అని బీజేపీ పాలిత రాష్ట్రాలను ఉద్దేశించి, ఎన్డీయే పాలనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఉద్దేశించిం కేంద్రంలోని మోడీ సర్కార్ నిత్యం చెప్పుకుంటూ ఉంటుంది. దీంతో… ఈ మహిళల అదృశ్యం విషయంలో మహారాష్ట్రం, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక (2021) రాష్ట్రాలు ఈ విషయంలో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ విషయాలపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని అంటున్నారు.
ఇదే సమయంలో అమ్మాయిలు, మహిళలు అదృశ్యం అయ్యారంటే.. అలా అని కేసు నమోదు అయిన ప్రతి సందర్భంలోనూ వాళ్ళు వ్యభిచార గృహాలకు తరలిపోయినట్లు కాదని గుర్తు చేస్తున్నారు. మహిళలు, అమ్మాయిలు అదృశ్యం అవ్వడానికి చాలా కారణాలే ఉంటాయని… అలా మిస్ అయిన ప్రతీ మహిళా ట్రాఫికింగ్ కి పాల్పడినట్లు కాదని హితబోధ చేస్తున్నారట.
మహిళల అదృశ్యం విషయంలో కూడా అనేక సామాజిక కారణాలు ఉంటాయనే కనీస అవగాహన పవన్ కు లేకపోవడం.. ఆయన చదివిన లక్షల పుస్తకాల్లో ఎక్కడా కనిపించకపోవడం దారుణమనే అంటున్నారు వాలంటీర్లు. భర్తల వేధింపులు భరించలేక ఇంట్లోనుంచి వెళ్లిపోవడం.. వారు ఇతర వైవాహికేతర సంబంధాల కారణంగా రహస్యంగా పారిపోవడం.. వారి సంబంధీకులు పోలీసు కేసు నమోదు చేయడం నిత్యం ఏదో ఒక మూల జరుగుతుంటాయి.
తాజాగా పబ్జీ ప్రేమలో పడి ఒక మహిళ పాక్ నుంచి ఢిల్లీ వస్తే… ఫేస్ బుక్ ప్రేమలో పడి మరో మహిళ పెళ్లై, పిల్లలుండి భారత్ నుంచి పాక్ కి వెళ్లిపోయింది. ఈ విషయం ప్రపంచానికి తెలిసింది కాబట్టి… ఇది మిస్సింగ్ కేసులెక్కల్లోకి రాకపోవచ్చు.. కేసు నమోదవ్వకపోవచ్చు! అలా అని రాజస్థాన్ లోని అంజూ అనే మహిళలను ఎవరు ఉమన్ ట్రాఫికింగ్ చేసినట్లో పవన్ చెప్పాలి.
ఇలా వాస్తవాలు మరిచి.. కనీస ఇంగితం లేకుండా ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయడం వల్ల కొత్త గౌరవం సంగతి దేవుడెరుగు… ఉన్న గౌరవం పోతోందని అంటున్నారు పరిశీలకులు!