(యనమల నాగిరెడ్డి)
అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో మొదలైన కోడికత్తి రాజకీయాలు అనేక రంగులు మార్చుకొని, రుచులు చేర్చుకొని జనాన్ని పూర్తి అయోమయంలో ముంచి తేల్చడంలో రాష్ట్రంలోని రెండు ప్రధాన రాజకీయ పక్షాలు విజయం సాధించాయని చెప్పక తప్పదు. ప్రస్తుతానికి మూడవ కృష్ణుడి రంగ ప్రవేశం కోడికత్తి రాజకీయాలను రసకందాయకంలో పడవేశాయి.
కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి పై దాడి జరిగినప్పటి నుండి కోడికత్తి తో పొడిస్తే మనిషి చస్తారా? అసలు చావరని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అంతేవాసులు, రాష్ట్ర పోలీసు బాసు ఘంటాపధంగా నొక్కి వక్కాణిస్తున్నారు. రాజకీయ లబ్ది కోసమే జగన్నాటకం ఆడుతున్నారని టీడీపీ వాసులు దుమ్మెత్తి పోస్తున్నారు. పైగా జగన్ మద్దతుదారుడే ఈ డ్రామాలో భాగస్తుడని, జగన్ కు సానుభూతి సాధించడం కోసమే కోడికత్తితో పొడిచాడని ముక్తాయింపు ఇచ్చారు. సీబీఐ లేదా ఎన్ఐఏ తో విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని కోరిన జగన్ (ఈ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకపోతె) ఈ రాష్ట్ర పౌరుడుగా ఉండటానికే ఆయనకు అర్హత లేదని, మరి ముఖ్యమంత్రిగా ఎలా ఉంటారని ఒక చవక బారు సందేహం కూడా లేవనెత్తారు.
ఇందులో వైసీపీ నేతల పొరపాట్లు అనేకం
కోడికత్తి దాడి ఘటనను సమర్థవంతంగాను, చట్టబద్ధము గాను ఎత్తి చూపడంలో జగన్ తో పాటు ఆయన ముఖ్య సలహాదారులు పూర్తిగా విఫలమయ్యారనే చెప్పవచ్చు. అక్టోబర్ 25న ఈ సంఘటన జరిగిన సమయంలో జగన్ సలహాదారులు అనేక మంది అక్కడే ఉన్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందడం లాంటివి చట్ట ప్రకారం చేయవలసి ఉంది. ఆ తర్వాతనే మెరుగైన చికిత్స పేరుతొ వేరే ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంది.
అయితే జగన్ కానీ, ఆయన ముఖ్య సలహాదారులు కానీ ఏంటో ప్రాధాన్యమున్న ఈ అంశాలను ప్రక్కన పెట్టి తాత్కాలిక ఉపశమనం కలిగించి ఆయన్ను హైదరాబాద్ కు పంపివేశారు. జగన్ కూడా చిరునవ్వుతో విమానం ఎక్కేసారు. ఇందువల్ల ఈ కేసులో చట్ట పరంగా ఉన్న ప్రాధమిక అవకాశాలను ఉపయోగించుకోకుండా హైదరాబాద్ కు వెళ్లిన తర్వాత వైసీపీ నేతలు గోల మొదలు పెట్టారు. అదే గోల విశాఖపట్టణంలోనే మొదలు పెట్టి ఉంటె బాబుకు, ఆయన దిగ్గజాలకు నోరు పెగలి ఉండేది కాదు. ఈ కేసు అపుడే కేంద్ర బలగాల చేతిలోకి వెళ్లి ఉండేది కూడా. ఆ తర్వాత జరిగిన రచ్చ రాజకీయ దుమారానికి తెరతీసింది తప్పా నిజాలు వెలుగు చూడలేదు.
దాడి ఘటనపై చంద్రబాబు రియాక్షన్. ఆయనపైనే దుమ్ము పోసింది
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక సాధారణ మనిషిపై దాడి జరిగితే కనీస సానుభూతి చూపడం జరగాలి. అదే కొంత ముఖ్యమైన వ్యక్తి ఐతే ఆ స్పందన మరింత జాగ్రత్తగా ఉండాలి. తనతో సమానమైన వ్యక్తిపై దాడి జరిగితే అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఐతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోణం లోనే చూసారు తప్ప పరిణితి చెందిన (40 ఇయర్స్ ఇండస్ట్రీ) నాయకుడిగా వ్యవహరించలేదు. “జగన్ డ్రామా వేశాడో? లేదో/ చెప్పలేము కానీ చంద్రబాబు మాత్రం తన ప్రతిష్టపై తానె దుమ్ము చల్లుకోవడంతో పాటు, డీజీపీతో కలిసి పోలీసు వ్యవస్థ విశ్వసనీయతను (పోలీసులు రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలు అనే అప ప్రధను నిజం చేశారు) కూడా సామాన్యుల దృష్టిలో పలుచన చేశారు.
డిజిపి సంఘటన జరిగిన వెంటనే దాన్ని తక్కువ చేసి చూపడానికి యత్నించడం, అదేవిధంగా చంద్రబాబుకు చెప్పడం, ఆయన, ఇతర టీడీపీ నాయకులు అదే పాటను తిరిగి, తిరిగి ఆలపించడం జరిగింది. జగన్ కు మేలు జరిగిందో లేదో అన్న విషయం పక్కన పెడితే టీడీపీకి, బాబుకు (అనుకూల మీడియా ఎంతగా గొంతు చించుకున్నా, పేపర్ లు నింపుకున్నా) ఇది ఖచ్చితంగా మచ్చగానే మిగిలింది. దీనికి తోడు బాబు గారు రాష్ట్ర పోలీసులకు నిజాయతీ సర్టిఫికెట్ ఇచ్చే క్రమంలో తన నిజాయతీని స్టేక్ లో పెట్టుకున్నారు. చంద్రబాబు పై నమ్మకంలేదని జగన్ ప్రకటించిన వెంటనే ఆయన {అయన ది కానీ, ఆయన అనుచరులది కానీ ఏ తప్పు లే(చేయ) కపోతె} వెంటనే జగన్ కోరిన సంస్థతో దర్యాప్తు చేయించి చేతులు దులుపుకుని ఉండాల్సింది. అలాగే హైకోర్టు ఉత్తర్వుల మేరకు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ కు సంపూర్ణ సహకారం అందించి ఉంటే ఆయనపైన, పార్టీపైనపడిన మచ్చ తొలగిపోయి ఉండేది. కానీ బాబు గారు మొండిగా ముందుకు వెళుతూ ఎన్ఐఏ దర్యాప్తును ఆపాలని హైకోర్టు ను ఆశ్రయించాలను కోవడం , సూత్రధారిగా అనుమానిస్తున్న టీడీపీ మద్దతు దారుడు చౌదరి వారం రోజులు పరారీ కావడం, దర్యాప్తుకు స్థానిక పోలీసులు సహకరించక పోవడం, లాంటి అనేక అంశాలు చంద్రబాబు పై ఉన్న అనుమానాలను నానాటికీ పెంచుతూ ఏమో చేశారెమో?లేకపోతె ఇన్ని అడ్డంకులెందుకు కల్పిస్తున్నారు అన్న ప్రశ్నలను సాధారణ ప్రజల మనుసుల్లో రేకెత్తిస్తున్నారు.
మూడవ కృష్ణుడు గా ఎన్ఐఏ రంగ ప్రవేశం
హైకోర్టు, కేంద్రం ఆదేశాల మేరకు కోడికత్తి సంఘటనపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చడానికి ఎన్ఐఏ రంగంలోకి దిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు కేసు దర్యాప్తును చేపట్టి, నింఐతుడు శ్రీనివాసరావు ను అదుపులోకి తీసుకొని వారం రోజుల పాటు విచారించింది. పోలీసులు జరిపిన విచారణ పత్రాలు తీసుకోవడానికి కోర్టు ఉత్తర్వులు కూడా పొందింది. చౌదరిని కూడా విచారించింది. విచారం పూర్తి చేసి, కొత్త బాంబు పేల్చి రాష్ట్రంలో రగులుతున్న రాజకీయ మంటలను ఉదృతం చేస్తుందా? లేక కొండను త్రవ్వి ఎలుకను పడుతుందా చూడాల్సిందే.
ఏది ఏమైనా పాలక, ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇరువురు అనాలోచితంగా చేసిన పొరపాట్లు కోడికత్తి దాడిని “రాజకీయ డ్రామాగా” మార్చి జనానికి చర్చనీయాంశంగా చేశారు. అయితే “నీరు పల్లమెరుగు. నిజం వాళ్ళిద్దరికే తెలుసు “