ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై, గతంలో.. అంటే, ఆయన ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. కోడి పందాల కోసం వినియోగించే చిన్న కత్తితో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఓ వ్యక్తి అరెస్టయ్యాడు, జైలుకు వెళ్ళాడు కూడా. ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ కేసుని విచారిస్తోంది. ఏళ్ళ తరబడి ఈ కేసు విచారణ కొనసాగుతూ.. సాగుతూ వస్తోంది తప్ప, విషయం ఓ కొలిక్కి రాలేదు ఇప్పటిదాకా.!
ఇదో రాజకీయ కోణంలో జరిగిన దాడి అనీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీనే హత్యాయత్నం చేసిందని అప్పట్లో వైసీపీ ఆరోపించింది. లేదూ.. కాదూ.. ఇది వైఎస్ జగన్ తన మీద తన సానుభూతిపరుడితో చేయించుకున్న దాడి.. అంటూ టీడీపీ ప్రత్యారోపణలు చేసింది కూడా.! ఈ కేసులో సాక్షిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టు ముందర విచారణకు హాజరు కావాల్సి వుంది. అయితే, వ్యక్తిగత విచారణ నుంచి ఆయన తాజాగా మినహాయింపును కోరారు. ‘రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాల్సి వుంది.. పేదలకు సంక్షేమ పథకాలపై సమీక్షా సమావేశాలు వున్నాయి..’ అంటూ పిటిషన్‌లో అభ్యర్థించారు వైఎస్ జగన్.
అంతేనా, ‘కోర్టుకు ముఖ్యమంత్రి హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. అడ్వొకేట్ కమిషనర్‌ని నియమించి, ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలి..’ అని జగన్ అభ్యర్థించడం గమనార్హం. దీన్ని కుంటిసాకుగా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. న్యాయస్థానం ముందర ఎవరైనా ఒకటేననీ, ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన వెసులుబాట్లు ఏమీ వుండవనీ న్యాయ నిపుణులూ అభిప్రాయపడుతున్నారు.
మరి, వైఎస్ జగన్ అభ్యర్థనను న్యాయస్థానం ఏ కోణంలో చూస్తుంది.? ట్రాఫిక్ ఇబ్బందులుంటాయని తెలిసి, రాజకీయ సభల్లో పాల్గొనడం మానేస్తున్నారా ముఖ్యమంత్రి.? అంటే, దానికి వైసీపీ ఏం సమాధానమిస్తుంది.? అన్నది సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి దూసుకొస్తున్న ప్రశ్న.