ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పిటిషన్లు, ముందస్తు బెయిల్ పిటిషన్లు, రిమాండ్ పిటిషన్లు కోర్టు పరిధిలో ఉన్నాయి. ఆ సంగతి అలా ఉంటే… ఈ నెల 29న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోర్టుకు రావాల్సి ఉందని అంటున్నారు. రానిపక్షంలో మేటర్ సీరియస్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వివరాళ్లోకి వెళ్తే… జగన్ కోడికత్తి కేసుపై విచారణ ఈ నెల 29కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ఈ రోజు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు వినేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిందని శ్రీనివాస్ తరపు న్యాయవాది సలీం వెల్లడించారు. ఈ సమయంలో జగన్ కచ్చితంగా కోర్టుకి హాజరుకావాల్సిందే అని న్యాయవాది సలీం తేల్చి చెబుతున్నారు.
ఈ విషయాలపై మరింత స్పందించిన ఆయన… జగన్ విచారణకు హాజరుకాకుంటే ఆయన మీద 228 ఐపీసీ కింద కేసు పెట్టండి అని కోర్టుకి విన్నవించినట్లు తెలిపారు! కోర్టుకి రాను ఎవరూ చెప్పడానికి వీలులేద్.. ఇదే సమయంలో జుడీషియల్ అధికారిని కించపరుస్తూ మాట్లాడితే 228 ఐపీసీ కింద కేసు పెడతారని సలీం చెబుతున్నారు!
ఈ మేరకు సంచలనం రేపిన జగన్ కోడి కత్తి కేసుపై విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. నిందితుడు శ్రీనివాసరావు తరపున న్యాయవాది సలీం తన వాదనలు వినిపించారు. అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
కాగా… ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 2018లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో జగన్ పై దాడి జరిగింది. ఈ కేసు విచారణను ఎన్ఐఏ కు అప్పగించారు.