ఏపీలో టీడీపీ నేతలకు, మరి ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని టీడీపీ నేతలకు కొత్త టెన్షన్ వచ్చి పడింది. దీంతో ఎవరికి వారే ప్రెస్ మీట్లు పెట్టుకుని తమ అభ్యర్థిత్వాలని కన్ ఫాం చేసుకుంటూ, అధినేతకు గుర్తుచేసే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకపోతుండటం గమనార్హం.
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వారాహి యాత్ర ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన ఉండే నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతూ, కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఈ సీట్లో తామే పోటీ చేస్తామని, గెలిచేది టీడీపీయే అని చెప్పుకుంటున్నారు.
అన్నవరం ప్రైవేట్ రిసార్ట్ లో ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు ఇన్ చార్జి వరుపుల సత్యప్రభ! ఈ సందర్భంగా… ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీదే విజయమని చెప్పుకొచ్చారు. తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కార్యకర్తలను వేడుకున్నారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా పర్యటించనున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తాను రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలో ఉంటానని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం ప్రెస్ ముందుకొచ్చి చెప్పుకున్నారు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ టికెట్టు జనసేనకు కేటాయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తుండటంతో బుచ్చయ్య అలర్ట్ అయ్యారు.
ఇలా మరికొంతమంది టీడీపీ నేతలు అలర్ట్ అవ్వనున్నారని తెలుస్తుంది. వీరిలో కొంతమంది ఇలా ప్రెస్ మీట్ లు పెట్టి పబ్లిక్ గా చెప్పుకుంటుండగా.. మరికొంతమంది కార్యకర్తల మీటింగ్స్ పెట్టుకుని చెప్పుకుంటున్నారంట. దీంతో గోదావరి జిల్లాల టీడీపీ నేతల్లో వారాహి టెన్షన్ నెలకొందని కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.